Natyam ad

అలిపిరి మార్గంపై నీలినీడలు

తిరుపతి ముచ్చట్లు:

 


వన్యప్రాణులు జనావాసాలలోకి రావడం అరుదేమీ కాదు. అయితే వాటి సంచారాన్ని  నిరోధించి అటవీ ప్రాంతంలోకి మళ్లించే చర్యలు చేపట్టకపోవడమే ఆశ్చర్యం. గట్టిగా మాట్లాడితే అసలు శేషాచలం అడవులలో వన్యప్రాణులు లేకుండా చేస్తామంటున్నారు. దీంతో శేషాచలం అడవులలో అక్రమార్కులకు అడ్డులేకుండా చేయాలన్న ప్రయత్నమేదైనా జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల వైభవాన్ని తగ్గించేందుకు.. వన్యప్రాణుల భయం పెట్టి భక్తులు రాకుండా చేసే ఉద్దేశమేమైనా ఉందా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. తిరుమల కొండకు అలిపిరి నడక మార్గంలో వెళ్లే వారికి  ఇప్పుడు చిరుతలు, ఎలుగుబంట్ల నుంచి ప్రమాదం పొంచి ఉంది. రెండు నెలల కాలంలో ఐదారు  చిరుతలను  అటవీశాఖ, టీటీడీ  అధికారులు బంధించారు. అయితే వారా చర్యలు చేపట్టడానికి ముందే అభంశుభం తెలియని  చిన్నారి చిరుతపులి  దాడిలో  ప్రాణాలు  కోల్పోయింది. ఈ ఘటన తరువాతే టీటీడీ, అటవీశాఖ కదిలాయి. బోనులు ఏర్పాటు చేశామని హడావుడి చేశాయి. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచనలు చేశాయి. భక్తులకు ఆత్మరక్షణ కోసం కర్రలు ఇచ్చాయి. అంతేనా నడకదారిలో నిషేధాజ్ణలు విధించాయి. ఓ నాలుగో, ఐదో చిరుతలను బంధించామని ప్రకటించాయి. బోనులో ఉన్న చిరువ దగ్దర టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఫొటోలు కూడా దిగారు.సరే ఆ తరువాత చిరుతల సంచారం గురించిన వార్తలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా అలిపిరి నడకదారిలో  మళ్లీ చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. చిరుతే కాదు ఎలుగుబంటి కూడా నడకదారిలో  ప్రత్యక్షమైంది. దీంతో నడకదారి భక్తులలో మళ్లీ భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  నడక దారిన నడచివేళ్ళే వారికి చేతి కర్రలను అందించే  కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. క్రూర మృగాలు ఎప్పుడు ఎటు వైపు నుండి దాడి చేస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటూ ఆ ఏడుకొండలవాడిపైనే భారం వేసి కాలి నడకన వెళ్తున్న భక్తులు చేతి కర్రలతో ఏం చేయాలని విమర్శలొచ్చాయి. పులులు, సింహాలను కర్రలతో తరమాలా అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అవన్నీ ఒకింత నెమ్మదించగానే మళ్లీ చిరుత సంచారం అంటూ వార్తలు రావడంతో  టీటీడీ తీర్పుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అటవీ క్రూరమృగాలు తిరుమల ప్రాంతానికి రాకుండా చర్యలు తీసుకోకుండా అడవిలో మృగాలను లేకుండా చేయాలనుకోవడం, లేదా వాటిని దారి మళ్లించి శేషాచలం అడవికు దూరంగా ఉంచాలన్న ప్రయత్నాలు టీటీడీ చేస్తున్నదన్న  అనుమానాలు వ్యక్తమవున్నాయి. అసలు  శేషాచలం అడవులను క్రూర మృగాల రహిత ప్రాంతంగా చేయాలనుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడవి నుండి మృగాలు తిరుమల మార్గంలోకి వచ్చే దారిలో రైలింగ్ వాల్స్ ఎత్తు పెంచడం.. నడక మార్గంలోకి అడవి నుండి మృగాలు వచ్చే అవకాశం ఉన్న చోట ఐరన్ గ్రిల్స్ తో జాలీలను ఏర్పాటు చేయడం వంటివి చేయవచ్చు. కానీ, టీటీడీ అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోకుండా అడవి మీద పడడం చూస్తే ప్రభుత్వానికి ఇక్కడ మరేదైనా ఉద్దేశ్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే తిరుమలకు భక్తుల రద్దీని తగ్గించే ఆలోచన చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామికి ఏడు కొండలు ఎందుకు..

 

 

 

రెండు కొండలు సరిపోవా అని అసెంబ్లీ సాక్షిగా వాదించారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆ మాట నిజం చేసే పని మొదలు పెట్టారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు శేషాచలం అడవులలో వైసీపీ ప్రభుత్వ అండదండలతో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈక్రమంలోనే రక్షణ చర్యలు తీసుకోకుండా తిరుమల వెళ్లే భక్తుల రద్దీని తగ్గించడం.. నడక మార్గంలో భక్తులను భయాందోళనకు గురిచేయడం.. అదే సమయంలో శేషాచలం అడవిలో క్రూర మృగాలను అడ్డు లేకుండా చేసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం అలజడి రేపుతోంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి రిపీటర్‌ మధ్య ప్రాంతంలో చిరుతపులి, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నెల 24 నుంచి 27 మధ్యన ఈ దృశ్యాలు నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు. చిరుత, ఎలుగుబంటి సంచారం నేపథ్యంలో నడక దారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గంపులుగా వెళ్లాలని సూచించింది. చిరుతను, ఎలుగుబంటిని బంధించేందుకు ఫారెస్టు అధికారులతో కలిసి చర్యలు చేపట్టినట్లు టీటీడీ వెల్లడించింది.తిరుమలలో కొన్ని నెలలుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న తిరుమల మెట్ల మార్గంలో లక్షిత అనే చిన్నారిపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. నాటి నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు.చిరుత దాడి ఘటనతో అప్రమత్తమైన టీటీడీ.. అటవీ శాఖ అధికారులతో కలిసి తిరుమల కొండల్లో పలుచోట్ల బోన్లను, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. అనంతరం ఐదు చిరుతలు బోన్లలో చిక్కాయి. ఆ చిరుతలను అటవీ శాఖ అధికారులు దట్టమైన అడవుల్లో వదిలిపెట్టారు. ఆ తర్వాత తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లోనూ చిరుతపులి కలకలం రేపింది.తిరుమల, తిరుపతిలో చిరుతపులుల సంచారం నేపథ్యంలో.. నడక మార్గంలో వెళ్లే భక్తులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా భక్తుల చేతికి కర్రలు ఇస్తోంది. అంతేకాకుండా.. భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తూ.. బృందానికి ఒకరు చొప్పున గార్డును నియమిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చిన్నారులను నడక మార్గంలో అనుమతించడంలేదు. అంతేకాకుండా.. చిన్నారులకు ట్యాగింగ్‌ను కూడా ఇస్తున్నారు టీటీడీ అధికారులు. ఏది ఏమైనా చిరుతలు నడకమార్గంలోకి రాకుండా ఫెన్సింగ్ వంటి చర్యలు చేపట్టకుండా టీటీడీ కాలయాపన చేయడమే అనుమానాలకు తావిస్తున్నది. తిరుమల నడకదారిని మూసేద్దామనుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Post Midle

Tags: Blue shadows on the Alipiri route

Post Midle