ఒరిస్సాలో నేతలపై బాంబు దాడులు

Date:22/04/2019

భువనేశ్వర్ ముచ్చట్లు :
డిశా రాజధాని భువనేశ్వర్‌లో ఆదివారం రాత్రి హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది. బీజూ జనతా దళ్‌(బీజేడీ) నాయకుడు అనంత్‌ నారాయణ్‌ జేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగన్నాథ్‌ ప్రధాన్‌ వాహనాలపై గుర్తు తెలియని దుండగులు బాంబులతో దాడులు చేశారు. ఈ దాడుల్లో అనంత్‌ నారాయణ్‌ జేన, జగన్నాథ్‌ ప్రధాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నారాయణ్‌ జేన భువనేశ్వర్‌ మేయర్‌గా పని చేశారు. ఇక భువనేశ్వర్‌ సెంట్రల్‌ నుంచి పోటీ చేస్తున్న జగన్నాథ్‌ ప్రధాన్‌ వాహనంపై బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు దాడి జరిగింది. ప్రధాన్‌పై బాంబు దాడి జరగడం ఇది మూడోసారి. ఈ బాంబు దాడిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఎన్నికల అధికారులను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కలిసి విజ్ఞప్తి చేశారు. ఒడిశాలో రోజురోజుకు హింస పెరిగిపోతుందని ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు, 21 లోక్‌సభ స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌ 11, 18 తేదీల్లో ఎన్నికలు జరగ్గా, మూడు, నాలుగో విడుత ఎన్నికలు ఏప్రిల్‌ 23, 29న జరగనున్నాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Tags:Bomb attacks against leaders in Orissa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *