విజృంభిస్తున్న విషజ్వరాలు

Booming toxins

Booming toxins

Date:19/09/2018
కరీంనగర్ ముచ్చట్లు :
వాతావరణ మార్పులతో కరీంనగర్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నారు. పలవురు చికెన్‌ గున్యా, డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా కేంద్రం ఆసుపత్రులకు ఇలాంటి వ్యాధి లక్షణాలతో వస్తున్న వారే అధికంగా ఉంటున్నారు. మొత్తంగా వైరల్ ఫీవర్స్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలోని వార్డులు కిటకిటలాడుతున్నాయి. జ్వర పీడితుల సంఖ్య పెరగడంతో పేషెంట్లకు ఆసుపత్రిలోని బెడ్స్ సైతం సరిపోవడంలేదు. దీంతో వరండాల్లోనే మడత మంచాలు వేసి వైద్యం చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
ఇదిలాఉంటే సర్కారీ దవాఖానాల్లో కొన్ని సందర్భాల్లో సరైన వైద్యం అందకపోవడంతో పలువురు ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. జ్వరపీడితుల సంఖ్య ప్రైవేటు ఆసపత్రుల్లోనూ కొన్ని రోజులుగా పెరిగిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. బాధితులు పెరిగిపోతుండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విషజ్వరాలను అదుపుచేసేందుకు వైద్య, పారిశుద్ధ్య విభాగాలు మరింతగా కృషి చేయాలని అంతా కోరుతున్నారు.
ఇదిలాఉంటే జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో చొప్పదండి, గంగాధర, కొత్తపల్లి, హుజురాబాద్‌, జమ్మికుంటల్లో మాత్రమే మెరుగైన వైద్యం అందుతోంది. మిగిలిన ఆసుపత్రుల్లో జ్వరం వచ్చిందని తెలియగానే సిబ్బంది సాధారణ వైద్యం కూడా అందించకుండా కరీంనగర్‌ ఆసుపత్రికి సిఫారసు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని అయిదు అర్బన్‌ వైద్య కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వపరమైన అన్ని ఆసుపత్రుల్లో  రక్తపరీక్షలతో పాటు తగిన వైద్యం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దోమల సంతతి పెరిగిపోవడం వల్లే విషజ్వరాలు విజృంభిస్తున్నాయని పలువురు అంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న అపరిశుభ్ర పరిసరాలు ప్రజలకు అపాయకరంగా మారాయని అంటున్నారు. పరిశుభ్రత లేకపోవడం వల్లే ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.
మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో పాటు వర్షాల మూలంగా నీరు నిలువడం, చెత్త చెదారం పేరుకుపోవడంతో దోమలు పెరిగిపోతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ సమీక్ష జరిగినప్పుడు జ్వరాలను తగ్గించేందుకు, దోమల నివారణకు డ్రైడేలు చేపట్టాలన్న ఆదేశాలు మొక్కుబడిగా అమలవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జ్వరాలకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ యంత్రాంగం ఈ ఏడాది విఫలమైందని పలువురు విమర్శిస్తున్నారు.
కుటుంబంలో ఒక్కరికి జ్వరం వస్తే అది తగ్గేలోపే మొత్తం కుటుంబాన్ని మంచాన పడేస్తోంది. జ్వరంతో పాటే రక్తకణాలు తగ్గడం విపరీతమైన ఒళ్లు, కీళ్లనొప్పుల మూలంగా లేవలేని పరిస్థితుల్లో జ్వరాలతో రోజుల తరబడి మంచాలకే పరిమితం అవుతున్నారు. వారం పాటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందినప్పటికీ పలువురు వేగంగా కోలుకోలేకపోతున్నారు.
నీరసించి మంచాలే పరిమితమవుతున్నారు. ఇదిలాఉంటే జ్వరాలకు వైద్యం పొందాలంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్క వ్యక్తికి కనీసం రూ.30 వేల నుంచి రూ.40 వేలు వెచ్చించాల్సి వస్తోంది. జ్వరాల తీవ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించకపోతే ప్రజలు ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయే ప్రమాదం ఉందని అంతా అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి జిల్లాలో పారిశుద్ధ్య పనులు సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాక ప్రభుత్వాసుపత్రుల ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Tags:Booming toxins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *