Borders of Kurnool district villages

కర్నూలు జిల్లా గ్రామాల్లో సరిహద్దల కంపలు

Date:27/03/2020

కర్నూలు ముచ్చట్లు:

కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ కోరలు చాస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా..ఊహకందని నష్టం జరుగుతుంది. మన ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు అయిన పల్లెసీమలకు ఈ మహమ్మారి వ్యాపిస్తే అంతే సంగతులు. అందుకే ప్రభుత్వ పిలుపు మేరకు గ్రామీణులు అప్రమత్తమవుతున్నారు. కరోనా నుంచి గ్రామాలను కాపాడుకోవడానికి స్వీయ నిర్బంధాన్ని విధించుకుంటున్నారు. ఊళ్లలోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని పలు గ్రామాల్లోకి ఇతరులు రాకుండా రోడ్లకు అడ్డంగా ముళ్లకంపలు వేశారు. మిడుతూరు మండలం చౌట్కూరు, పగిడ్యాల మండలం పడమర ప్రాతకోటలోకి ఇతరులు ప్రవేశించకుండా  రోడ్లను దిగ్బంధించారు.దేవనకొండ మండలంలోని తెర్నెకల్‌–ఎమ్మిగనూరు రహదారికి  ముళ్లకంపలు, రాళ్లను అడ్డంగా వేశారు.  పాణ్యంలోని తెలుగుపేట కాలనీ రోడ్డును ముళ్ల కంపలతో దిగ్బంధించారు. ఇదే మండలం కొండజూటూరులోకి ప్రవేశించే దారులన్నీ మూసేశారు.

 

 

 

హొళగుంద మండలం గజ్జహళ్లిలోకి ప్రవేశించే అన్ని మార్గాలనూ మూసేశారు. బెంగళూరు నుంచి వచ్చిన 30 మంది వలస కూలీలకు చేతులు శుభ్రం చేయించడంతో పాటు స్థానిక పీహెచ్‌సీలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే గ్రామంలోకి అనుమతించారు.  వెల్దుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రతి గ్రామానికీ రాకపోకలు బంద్‌ చేశారు. తుగ్గలి మండలంలోని పెండేకల్లు, తుగ్గలి తదితర గ్రామాల్లో రోడ్లను దిగ్బంధించారు.   ఆదోని నియోజక వర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఇతరులెవరూ ప్రవేశించకుండా అన్ని రోడ్లను ముళ్ల కంచెల, బండరాళ్లు, ఎడ్ల బండ్లతో దిగ్బంధించారు.నంద్యాల మండలం పులిమద్ది, జూపాడుబంగ్లా మండలం తాటిపాడు, పాణ్యం మండలం కొత్తూరు, పెద్దకడబూరు మండల కేంద్రంలోకి ప్రవేశాలను నిషేధించారు.కల్లూరు మండలం చిన్నటేకూరు, బస్తిపాడు, తడకనపల్లె మజారా గ్రామమైన ఓబులాపురం, ఓబులాపురం తతండా గ్రామాల ప్రజలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు,కట్టెలు, ముళ్లకంపలను వేశారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో లాక్‌డౌన్‌ సంపూర్ణంగా జరుగుతోంది.

 

 

ఉగాది పండుగ నేపథ్యంలో పండుగ సరుకులు కొనాలని, దేవుళ్లకు నైవేద్యం పెట్టాలని కొందరు రోడ్లపైకి వచ్చారు. అది కూడా ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ కనిపించలేదు. వీధుల్లోని చిన్న చిన్న గుళ్లకు ఇంటికి ఒకరిద్దరు చొప్పున వెళ్లి నైవేద్యాలు ఇచ్చి వచ్చారు. కర్నూలులో ఉదయం 7 గంటల నుంచే జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు.  క్వారంటైన్‌లో ఉన్న వారు బయట తిరిగితే జైలుకు పంపించాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

 

 

 

 

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై మంగళవారం కేసులు నమోదు చేయడంతో బుధవారం రహదారులపైకి వచ్చే వారి సంఖ్య తగ్గింది. కర్నూలు నగరానికి వచ్చే అన్ని రహదారులను పోలీసులు మూసేశారు. ప్రధాన వీధులను సైతం బారికేడ్లు పెట్టి బంద్‌ చేశారు.  నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, డోన్, ఆత్మకూరు, బనగానపల్లె, ఆళ్లగడ్డ తదితర అన్ని చోట్ల లాక్‌డౌన్‌ కారణంగా రహదారులు నిర్మానుష్యమయ్యాయి.

టీడీపీకి కలిసొచ్చిన ఎన్నికలు వాయిదా

Tags: Borders of Kurnool district villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *