రుణం చిక్కేనా?

Date:17/07/2018
కరీంనగర్ ముచ్చట్లు:
వర్షపాతం ఆశాజనకంగా ఉండడంతో.. తెలంగాణ రైతాంగం సాగు పనుల్లో నిమగ్నమైంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అందిన పెట్టుబడి సాయమే కాక వ్యవసాయ రుణాలు సైతం తీసుకుంటూ సాగు పనులు ముమ్మరం చేశారు. అయితే.. రైతుల్లో అనేకమందికి బ్యాంకుల నుంచి పంటరుణం అందలేదన్న వార్తలు కరీంనగర్ జిల్లాలో వినిపిస్తున్నాయి. రుణం అందకపోవడంతో అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చుకుంటున్నారని.. ఫలితంగా వారికి ఆర్ధిక భారమవుతోందని  సమాచారం. గత రికార్డులు, పాసుపుస్తకాలు అన్నీ సక్రమంగా ఉన్నా కొత్త పాసుపుస్తకాల వల్లే కొంత సమస్య వచ్చిందని పలువురు రైతులు అంటున్నారు. ఆన్‌లైన్‌ పహాణీ, 1బి తీసుకురావాలని బ్యాంకర్లు చెప్తుండడంతో అన్నదాతలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ధరణి వెబ్‌సైట్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో సకాలంలో రుణాలు అందుతాయో లేదో అనే సందిగ్ధంలో పలువురు రైతులు ఉన్నారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.898 కోట్ల రుణాలు మంజూరు చేశారు. దాదాపు 80 వేల మందికి పైగా రుణాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం రుణాల రీషెడ్యూల్‌ చేసుకునేందుకు బ్యాంకులు నానాతిప్పలు పెడుతున్నాయని రైతులు అంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. తాము ఆర్ధికంగా.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాపోతున్నారు.ధరణి వెబ్‌సైట్‌ను మీ సేవ కేంద్రాలకు అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే ఈ పని ఇప్పటికీ పూర్తి కాలేదని సమాచారం. అందుకే రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయని పలువురు అంటున్నారు. మరోవైపు పాస్‌పుస్తకాల పంపిణీ జరిగాక తప్పులు వచ్చిన వాటిని సరిచేసే కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తలమునకలై ఉన్నారు. జిల్లాలో ఆధార్‌ సీడింగ్‌, డబుల్‌ ఖాతాలు, వారసత్వం, చనిపోయిన వారి వివరాలు, భూములు అమ్ముకుని వెళ్లినవారి వివరాల తప్పులను అధికారులు సరిచేస్తున్నారు. ధరణి వెబ్‌సైట్‌ మొరాయిస్తుండటంతో కొంత ఆలస్యంగానైనా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణిలో తప్పులు సరిచేయడం పూర్తయిన తరువాతే కొత్త పాస్‌పుస్తకాల జారీ చేయాలంటూ చెప్పడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే సరికి మరింత సమయం పడుతుందేమోనని రైతులు భావిస్తున్నారు. పాత రుణాలు తీసుకున్న రైతులకు గతంలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు కొత్తగా ఇచ్చిన పాస్‌పుస్తకాల్లో సరైన భూవిస్తీర్ణం ఉంటేనే కొన్ని మండలాల్లోని బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఏదేమైనా పలువురు రైతులకు మాత్రం రుణం అందని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి సకాలంలో పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో ఆర్ధికంగా నష్టపోతామని.. ఒకవేళ సాగు పనులు ఆలస్యమైతే.. పంట దిగుబడి ప్రభావితమవుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రుణం చిక్కేనా?https://www.telugumuchatlu.com/borrow-money/
Tags: Borrow money?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *