దోపిడీకి అడ్డేదీ..? 

Date:19/05/2018
నాయుడుపేట  ముచ్చట్లు:
జిల్లాలో అపారంగా ఉన్న సహజ వనరుల నుంచి స్థానిక సంస్థలకు సీనరేజీ  రూపేణా రావాల్సిన రూ. కోట్ల ఆదాయానికి రాజకీయ  జోక్యంతో గండి పడుతోంది. స్థానిక సంస్థల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులపైనే ఆధార పడాల్సి వస్తోంది. ఏడాదికి సుమారు రూ.4.6 కోట్ల రాబడి పక్కదారి పడుతోంది. నాయుడుపేట మండలం పుదూరు, అరవపెరిమిడి, ఓజిలిలోగ్రావెల్‌  తవ్వకాలు జరుగుతున్నాయి. రహదారుల నిర్మాణానికి ఇక్కడి నుంచి గుత్తేదారులు భారీగా తవ్వకాలు జరుపుతున్నప్పటికీ స్థానికంగా అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వానికి స్థానిక పంచాయతీలకు రాయల్టీ రూపంలో రావల్సిన రాబడి రావడంలేదు. నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో గతంలో ఇసుక క్వారీల  లీజుల వల్ల ఏడాదికి రూ. 10 లక్షల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. రెండేళ్లుగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఆదాయం పూర్తిగా కోల్పోగా పక్క ప్రాంతాలకు అక్రమ ఇసుక రవాణా యథావిధిగా జరుగుతుంది. స్థానిక అవసరాలకు మాత్రం డిమాండ్‌ నెలకొంది. పెళ్లకూరు మండలం శిరసనంబేడు ప్రాంతంలో ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం గుర్తించి సక్రమ పద్ధతిలో లీజులు నిర్వహిస్తే స్థానిక పంచాయతీకి భారీగా రాబడి వచ్చే అవకాశముంది. స్థానిక రాజకీయ నేతల జోక్యం వలన ఇక్కడ క్వారీ నిర్వహణ గత కొన్నేళ్లుగా నామమాత్రంగా మారింది.గూడూరు మండలంలో వెందోడు, కుందకూరు ప్రాంతాల్లో మెటల్‌ క్వారీ నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం 20 లారీల వరకు మెటల్‌ను రోడ్ల నిర్మాణానికి తరలిస్తుంటారు. లీజులు ఒక దగ్గర పొందడం, అనుమతులు లేని చోట్ల తవ్వకాలు జరపడం వంటి అక్రమాలు ఈ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇక్కడ ఏడాదికి రూ.10 లక్షలు రావాల్సి ఉన్నా కేవలం రూ. 3 లక్షలు మాత్రమేవస్తోంది .మేనకూరు పారిశ్రామిక వాడలో ఉన్న ఒక పరిశ్రమ పెద్దఎత్తున సిలికా ఇసుక నిల్వ చేసి గ్రేడింగ్‌ చేసి ఇతర దేశాలకు సరఫరా చేస్తోంది. రూ. కోట్లలో వ్యాపారం జరుగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిలికా ద్వారా రావల్సిన ఆదాయానికి  భారీగా గండి పడుతుంది.
Tags; Bother to exploit?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *