బొత్స సత్యనారాయణ ఫ్యూచరేంటి…

Botsa Satyanarayana Futurrenti ...

Botsa Satyanarayana Futurrenti ...

 Date:15/08/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గజం.. ఉత్తరాంధ్రలో చ‌క్రం తిప్పిన మాజీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ఫ్యూచ‌ర్ ఏంటి? ఇప్పుడు ఆయ‌న ఎలా ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పటికీ.. ఆయ‌న‌కు అనుకున్నంత‌గా గుర్తింపు ల‌భించ‌డం లేదా? అనే సందేహాలు ప‌్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి ఆయ‌న రాష్ట్రంలో ఓ వెలుగు వెలుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత‌లు నిర్వహిస్తూనే మంత్రి అయ్యారు. రాష్ట్రం స‌మైక్యంగా ఉండాల‌ని కోరుకున్న కాంగ్రెస్‌ వారిలో బొత్స లేక‌పోవ‌డంతో ఆయ‌న‌ తెర‌మీదికి వ‌చ్చారు. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే త‌ప్పేంట‌ని ఆయ‌న ప్రశ్నించారు.
ఇక‌, 2014లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌పై అలిగి ఆయ‌న పార్టీకి దూరంగా జ‌రిగారు. ప్రస్తుతం ఆయ‌న వైసీపీలో ప్రధాన కార్య‌ద‌ర్శి, అధికార ప్రతినిధి హోదాలో కొన‌సాగుతున్నారు.మ‌రో ప‌దిమాసాల్లో ఎన్నిక‌లు ఉండ‌డం, రాజ‌కీయంగా వైసీపీ గెలిచి తీరాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌డం వంటి అత్యంత క్లిష్టమైన ప‌రిస్థితిలో బొత్స వైసీపీలో ఎలాంటి రోల్ పోషిస్తున్నారు? ఆయ‌న ఎలా ముంద‌డుగు వేస్తున్నారు? వ‌ంటి అంశాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ క్రమంలో రాజ‌కీయ అనుభ‌వం భారీగా ఉన్న బొత్స వంటి వారు కీల‌క బాధ్యత‌ల‌ను తీసుకుంటార‌ని అంద‌రూ ఆశిస్తున్నారు.
ఉత్తరాంధ్రలోని తూర్పు కాపు కులం బలంగా ఉంది. ఈ సామాజికవర్గానికి చెందిన బొత్సను అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంది. స్థానిక కాపు నేత‌లు గొర్లె శ్రీరాములునాయుడు, కిమిడి కళావెంకట్రావు, బొత్స సత్తిబాబు తమ తూర్పుకాపు కులం నుంచి ఎదిగిన గొప్ప నాయకులని ఆ వ‌ర్గంవారు చెప్పుకుంటారు.అయితే, ఉత్తరాంధ్రలో కీల‌క‌మైన మ‌రో జిల్లా విజ‌య‌న‌గ‌రంలో బొత్సకు వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఇక్కడ బొత్సకు వ్యతిరేకవర్గంగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామితో ఉన్న కొందరు తూర్పుకాపు నేతలు బీసీ-ఏ క్యాటగిరీలో తమ వారిని చేర్చాలన్న నినాదాన్ని వినిపిస్తున్నారు. మ‌రోప‌క్క, బొత్స వెళ్లి కాపుల‌కు మ‌ద్దతు ప‌లికారు. ఈ నేప‌థ్యంలో ఈయ‌న వ్యవ‌హారం వివాదంగా మారింది. అయితే, జ‌గ‌న్ సూచ‌న‌ల‌మేర‌కే తాను ఇలా న‌డుచుకుంటున్నట్టు బొత్స త‌న వారికి చెప్పుకొన్నారు.
ఏదేమైనా.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఉత్తరాంధ్ర‌లో ప‌ట్టు సాధించాల్సిన బొత్సకు ఒకింత వ్యతిరేక‌త ఎదుర‌వుతుండ‌డం, పార్టీలో ఆశించిన మేర‌కు గుర్తింపు లేక‌పోవ‌డం వంటివి మ‌న‌స్తాపాన్ని క‌లిగిస్తున్నాయి.విజయనగరం నియోజకవర్గానికి నీవే అభ్యర్థివి అంటూ జగన్‌ చేతిలో చేయివేసి చెప్పారంటూ కోలగట్ల చెప్పుకోసాగారు.. పైపెచ్చు కోలగట్ల విజయానికి బొత్స పూర్తి సహకారం అందించాలని ఆదేశించినట్లు కోలగట్ల వర్గం ప్రచారం కూడా చేసుకుంటోంది. ఈ విషయాన్ని బొత్స వర్గం కాదనడం లేదు. అలాగ‌ని కోల‌గ‌ట్లతో క‌లిసి ప‌నిచేసే వాతావ‌ర‌ణ‌మూ లేదు. దీంతో అదిష్టానం మాట కాద‌లేక‌, సొంతంగా ప్రజ‌ల మ‌ధ్యకు వెళ్లలేక స‌త్తిబాబు పోటీలో వెన‌క‌బ‌డిపోతున్నట్టు ఆయ‌న అనుచ‌రుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.
ఇదే విధానం కొన‌సాగితే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌ర‌గ‌బోయే జ‌గ‌న్ పాద యాత్రలో క్రియాశీల పాత్ర కోట‌గ‌ట్లదీ, ప్రేక్షక పాత్ర బొత్స ది కాక మాన‌దు.ఇక బొత్సతో వేగ‌లేక బొబ్బిలి రాజులు టీడీపీలో చేరిపోయారు. ఇది వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ. ఇప్పుడు కోల‌గ‌ట్లతోనూ అంత‌గా పొస‌గ‌ని ప‌రిస్థితి. దీనికి తోడు బొత్స ఫ్యామిలీ క‌బంద హ‌స్తాల్లో జిల్లా వైసీపీ ఇరుక్కుపోయింద‌న్నది జిల్లా వైసీపీలో బ‌లంగా వినిపిస్తోంది. ఈ ప‌రిణామాలు అన్ని బొత్సకు మైన‌స్‌గా మారుతున్నాయి. మ‌రి ఈ ప‌రిణామాల నుంచి త‌న‌ను తాను కాపాడుకుని.. క్రియాశీలం అయ్యేందుకు బొత్సకు స‌మ‌యం ప‌ట్టేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:Botsa Satyanarayana Futurrenti …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *