కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తానికి బ్రేకులు

హైదరాబాద్  ముచ్చట్లు:


కేసీఆర్ రాజకీయ వారసుడు, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్  అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం తద్యమనే వార్తలొచ్చాయి. ముహూర్తాలు ఖరారయ్యాయి. బహిరంగ వేదికల నుంచి మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, అయన సమక్షంలోనే  కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. అయితే, అక్కడక్కడా వినిపిస్తున్నట్లుగా  కుటుంబ కలహాలు కారణమా,ఇంకేదైనా కారణమా, ఏమో కానీ, విఘ్నేశ్వరుని పెళ్లి ముహూర్తం లాగా, కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి,  రామన్న పట్టాభిషేక ముహుర్తం ఇంతవరకు ముడిపడలేదు.  అదలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం, ఇక ఈసారికి కేటీఆర్ కి ముఖ్యమంత్రి యోగం లేనట్లేనని అంటున్నారు. అదే విషయాన్ని వాళ్ళు వీళ్ళూ కాకుండా మంత్రి కేటీఆరే స్వయంగా వెల్లడించారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆరే అని స్వయంగా ప్రకటించారు.ఇటీవల మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్  వచ్చే ఎన్నికల్లోనూ తెరాస 90 ప్లస్ సీట్లు తెచ్చుకుని. అధికారంలోకి వస్తుందని చెప్పు కొచ్చారు. అది ఎంత నిజమో  ఏమో కానీ కేటీఆర్ అక్కడితో ఆగకుండా, దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డ్ సృష్టిస్తారని ఇంకో మాట జోడించారు.

 

 

 

సరే మళ్ళీ తెరాస అధికారంలోకి వస్తుందా, రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, వస్తే మాత్రం మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, కేటీఆర్  స్పష్టంగానే చెప్పారు. ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నిజానికి కేటీఆర్ ఒక్కరే కాదు, గతంలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని పబ్లిక్ గా చెప్పిన నాయకులతో సహా తెరాస నాయకులు గత కొంత కాలంగా ఇదే విషయం చెపుతూ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు  కొత్త సచివాలయంలోకి ముఖ్యమంత్రిగా ఆయనే కాలు పెడతారని తెరాస నేతలు టీవీ చర్చలలో ఇతరత్రా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కేటీఆర్ స్వయంగా అదే విషయాన్ని శంఖంలో పోశారు.  సో .. అప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పటికైతే కేటీఆర్ ముఖ్యమంత్రి ‘కుర్చీ’ కోరికకు కళ్ళెం వేసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.పార్టీలోనూ అదే చర్చ జరుగుతోందని అంటున్నారు. ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది? కొద్ది రోజుల క్రితం వరకూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళతారని ఫ్రంట్ కాదంటే జాతీయ పార్టీ పెట్టేసి, ఢిల్లీ వెళ్లి పోతారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ కి అప్పగిస్తారని, అదనీ, ఇదనీ చాలా చర్చ జరిగింది. చాలా చాలా  ఉహాగానాలు వినిపించాయి. ఉహాగానాలు కూడా కాదు స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు జాతీయ ఆలోచనలను బహిరింగంగానే వినిపించారు.  మరోవంక  ఎక్కడా పెద్దగా ఖండనలు రాలేదు. తెరాస నాయకులు  ఎవరూ ఉహాగానాలను  కాదనలేదు. ఖండించలేదు.

 

 

 

మరోవంక, అవును అది నిజమే అనే సంకేతాలు ఇస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ కూడా దూకుడు పెంచారు. వేషం కాకపోయినా భాష మార్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు స్వయంగా అయనే తీసుకున్నారని, తీసుకుంటున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి.  ఇప్పుడు కేటీఆర్ ఎందుకు  ‘యు’ టర్న్ తీసుకున్నారు? అంటే  అందుకు సర్వేలే కారణమని అంటున్నారు. ముఖ్యంగా  ప్రశాంత్  కిశోర్ బృందం పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం ఏమిటి? అనే విషయంగా నిర్వహించిన ‘ప్రత్యేక’ సర్వేలలో, తెరాసను వ్యతిరేకిస్తున్న వారిలో అత్యధిక శాతం ప్రజలు, కుటుంబ పాలనకు వారసత్వ రాజకీయాలకు పెద్ద పీట వేశారు.  పీకే సర్వేతో పాటుగా ఇతర  సర్వేలలోనూ, తెరాసను వ్యతిరే కిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది, ప్రదానంగా కుటుంబ వారసత్వ రాజకీయాలను. కుటుంబ అవినీతిని  వ్యతిరేకిస్తున్నట్లు తేలిందని అంటున్నారు. అలాగే, కేంద్ర సంస్థలు నిర్వహించిన సర్వేలలోనూ కుటుంబ పాలన, కుటుంబ అవినీతిని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున విషయం తేట తెల్లమైందని  తెలుస్తోంది.ఈ నేపధ్యంలోనే ప్రధాన మంత్రి నరెంద్ర మోడీ కూడా, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలపై దృష్టి పెట్టాలని, రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు, రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా వినవస్తోంది.  ఈ నేపధ్యంలోనే, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, కుటుంబ అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు,ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే కేటీఆర్ ముఖ్యమత్రి  రేసు నుంచి తప్పుకున్నారని అంటున్నారు. అంతే కాకుండా, మహారాష్ట్ర పరిణామాల అనంతరం,

 

 

 

బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే మాట బహిరంగంగా వినిపిస్తున్న నేపధ్యంలో  ఇప్పడు నాయకత్వ మార్పు జరిగితే,  బీజేపీ సహకారంతో  తెరాసలో షిండేలు పుట్టుకు రావచ్చనే అనుమానాల చేతనూ  ప్రస్తుతానికి, యథాతథ స్థితి కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ మేరకు  కేసీఆర్, కేటీఆర్ ఒక అంగీకారానికి వచ్చారని అంటున్నారు.అదొకటి అలా ఉంటే, నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలంగా కుటుంబంలో ఎంతగా వత్తిడి వచ్చినా, కేటీఆర్ కి పగ్గాలు అప్పగించక పోవడానికి కూడా ఇదే కారణంగా అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కోరుకున్నదే ప్రశాంత్  కిశోర్  సర్వేలు చెప్పాయి. మరో వంక, మహారాష్ట్ర పరిణామాలు కూడా కలిసొచ్చాయి. అలా కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపి, కేటీఆర్ నోటి నుంచే ‘హ్యాట్రిక్’ పలుకులు పలికించారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. అవును  కేసీఆర్  రాజకీయ చతురత గురించి, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన  అవసరం లేదు. కానీ, చెప్పుకోక తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఅర్  చాలా కాలంగా కుటుంబంలో చాలా చాలా సమస్యలు ఎదుర్కున్నా, చివరాఖరుకు కుటుంబ రాజకీయాల్లోనూ పై చేయి సాధించారని, కేటీఆర్  కోరికలకు కళ్ళెం వేయడంలోనూ అయన సక్సెస్ అయ్యారని అంటున్నారు.

 

Tags: Brakes for KTR’s coronation moment

Leave A Reply

Your email address will not be published.