పటాన్ చెరువు నియోజకవర్గంలో కారుకు బ్రేక్

Date:11/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడగా పేరుగాంచిన పటన్‌చెరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీపై నాయకులు పగబట్టారు. నాలుగున్నర ఏళ్ల పాటు పార్టీలో కొనసాగిన నాయకులంతా ఒక్కొక్కరుగా కారు దిగి చేయి చేయి కలిపి తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. నామినేషన్ల ఘట్టానికి తెరలేస్తే పటన్‌చెరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతుంది. నియోజకవర్గంలో పేరున్న నాయకులే కాకుండా గ్రామాల్లో ఉన్న అసంతృప్త నేతలను తమవైపు మలుపుకునేందుకు కాంగ్రెస్ నేతలు చాపక్రింద నీరులా పని చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందనుకోవడం పొరపాటే. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కూడా తన ఉనికిని చాటుకుంటుంది.శాసన సభను రద్దు చేస్తూ టీఆర్‌ఎస్ అధినేత అభ్యర్థులను ప్రకటించిన వెంటనే మొట్టమొదటి అసమ్మతి వినిపించింది పటన్‌చెరు నియోజకవర్గం నేతలే.
నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న అనీల్‌కుమార్, గడచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సఫాన్‌దేవ్, జిన్నారం ఎంపీపీ మాజీ అధ్యక్షుడు కొలన్ బాల్‌రెడ్డి, డోకూరి రాంమోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రామచంద్రాపురం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్‌రెడ్డి తదితరులు టీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందుగానే అంజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న శశికళ యాదవరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎవరి పంథాలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమలో అధిష్ఠానం ఎవరికి టికెట్ కేటాయించినా అభ్యర్థిని గెలిపించుకుంటామని ఐక్యతారాగం పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతల్లో చాలా మంది ఆశావహులు ఉన్నారు.
టికెట్ల కేటాయింపు, నామినేషన్ల దాఖలైతే కానీ పటన్‌చెరు నియోజకవర్గంలో రసవత్తర రాజకీయాలు తెరలేవడం ఖాయమే. ఇదిలావుంటే మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి చాపక్రింద నీరులా తన ప్రచారాన్ని కొనసాగించుకుంటూ పోతున్నారు. అభ్యర్థిని ప్రకటించడంలో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. బలమైన ప్రత్యర్థిని ఓడించాలన్న కసితో ఉన్న నేతలకు అభ్యర్థి పేరు ఖరారు కాకపోవడం, ప్రత్యర్థి ఓటర్ల మద్దతు కూడగడుతుండం జీర్ణించుకోలేకుండా చేస్తోంది. మహీపాల్‌రెడ్డి ఏం మాయ చేస్తాడోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పటన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం, ఐడీఏ బొల్లారం తదితర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. బతుకుదెరువు నిమిత్తం ఆయా రాష్ట్రాల నుండి వచ్చి పరిశ్రమల్లో పని చేస్తూ స్థిరపడిన వారున్నారు.
అలాంటి ఓటర్లను ఆకట్టుకోవడం అభ్యర్థులకు తల ప్రాణం తోకకు వస్తోంది.  పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల అండతో సీపీఎం పార్టీ కూడా బరిలోకి దిగడం ఖాయమే. రసవత్తర రాజకీయాలు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పటన్‌చెరు సెగ్మెంట్లోనే దర్శనమిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీఆర్‌ఎస్ ఆశలు అభివృద్ధిపై ఉంటే కాంగ్రెస్ పార్టీ మ్యానిపెస్టో, టీఆర్‌ఎస్ ఒంటెద్దు నిర్ణయాలపై విమర్శలు సందిస్తూ ముందుకు వెళ్లనుంది. ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గుచూపిస్తారో డిసెంబర్ 11వ తేదీన వెల్లడికానుంది.
Tags:Break the car in the Patton Pond constituency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *