విద్యార్ధుల్లో నిస్సత్తువ తొలగించేందుకు అల్పాహారం..

Date:17/09/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
సర్కారు బడుల్లో హాజరు శాతం పెంచేందుకు ప్రభుత్వం, విద్యావిభాగం పలు చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాక ఉత్తీర్ణత శాతాన్ని కూడా పెంచేందుకు కృషిచేస్తున్నాయి. ప్రధానంగా పదవ తరగతి చదివే విద్యార్ధులపై ఆదిలాబాద్‌లోని అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించే సమయంలో అల్పాహారం ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రత్యేక తరగతుల నిర్వహణ సమయంలో విద్యార్థుల అలసటను దూరం చేసేందుకు అల్పాహారం అందించనున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ విద్యాశాఖకు కలెక్టర్ ఏకంగా రూ.22.51 లక్షలు విడుదల చేసినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచే విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. విద్యార్ధుల్లో నిస్సత్తువను దూరంచేసి చదువుపై దృష్టి పెట్టేలా చేసేందుకే అధికార యంత్రాంగం ఈ ఏర్పాటు చేస్తోంది.
జిల్లాలో 4,502 మంది విద్యార్థులు ప్రస్తుతం పదోతరగతి విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో అత్యధికులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే. పలువురు పిల్లల తల్లితండ్రులు కూలీనాలీ చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇక విద్యార్ధుల్లో అత్యధికులు ఉదయం పూట ఇంట్లో తినకుండా చదువుపై ఉన్న మమకారంతో హడావుడిగా బడిబాట పడుతున్నారు. ఇలాంటి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ మరింత ఇక్కట్లను గురిచేస్తోంది.
ఆకలి కారణంగా విద్యార్థులు తాము చెప్పే పాఠాలపై అంతగా ఆసక్తి చూపడం లేదన్న భావన ఉపాధ్యాయులూ వ్యక్తంచేస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు చురుగ్గా ఉన్నచోట దాతల నుంచి విరాళాలు సేకరించి విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఈసారి కొంతమంది అదే ప్రయత్నాలు చేయాలని భావించిన బదిలీల కారణంగా పలువురు టీచర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లారు.
అక్కడ పరిచయాలు అంతగా లేకపోవడంతో .. ఈలోగా ప్రత్యేక తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థులు పస్తులతోనే పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ క్రమంలో ఈనెల 6న పాలనాధికారి జడ్పీ సమావేశమందిరంలో హెచ్‌ఎంలతో పదోతరగతి పరీక్షల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఓ ప్రధానోపాధ్యాయుడి విద్యార్థులకు అల్పాహారం అందిస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో కలెక్టర్ స్పందించి నిధులు మంజూరు చేశారు.
ఒక్కో విద్యార్థికి రూ.5 చొప్పున నిధులు మంజూరు చేశారు. ఈ నిధులను విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఖాతాలో జమ చేస్తారు. గతంలో ఏ పాలనాధికారి ఇలా అల్పాహారం కోసం నిధులు వెచ్చించిన దాఖలాలు లేవని అంతా అంటున్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయుల కృషికి తోడు విద్యార్థులు పట్టుదల తోడైతే కలెక్టర్ ఆశించినట్లు మెరుగైన ఫలితాలు వస్తాయని విద్యార్ధి సంఘాల నేతలు అంటున్నారు.
Tags:Breakfast

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *