పరిశోధనలను ల్యాబ్‌ల నుంచి ల్యాండ్‌లోకి తీసుకురండి

– ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
Date:16/03/2018
ఇంఫాల్‌  ముచ్చట్లు:
శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను ల్యాబ్‌ల నుంచి ల్యాండ్‌లోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు మణిపూర్‌లోని ఇంఫాల్‌లో 105వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభ సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఆవిష్కరణలు చేయడంలో, శాస్త్రసాంకేతికను ఉపయోగించడంలో భారత్‌కు సుదీర్ఘమైన చరిత్ర  ఉందని మోదీ అన్నారు. శాస్త్రసాంకేతిక రంగంలో ముందు వరుసలో ఉన్న దేశాల సరసన భారత్‌ను నిలబెట్టాలని కోరారు. సాధారణ ప్రజలకు సంబంధించి సాంఘిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు సైన్స్‌ ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. అట్టడుగు వర్గాల వద్దకు కూడా శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం చేరుకోవడమే ఈ సదస్సు లక్ష్యమని మోదీ  పేర్కొన్నారు. శాస్త్రీయ రంగంలో తమ విజయాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని, దీని ద్వారా యువతలో ఉత్సాహం నెలకొల్పినట్లవుతుందని అన్నారు. పిల్లలకు ప్రయోగశాలలు అందుబాటులో ఉంచాలని, శాస్త్రవేత్తలు పాఠశాల విద్యార్థులతో పరస్పర సంభాషణలు జరిగే విధంగా ఓ మెకానిజం అభివృద్ధి చేయాలని కోరారు. తొమ్మిది నుంచి 12వ తరగతి చదువుతున్న వంద మంది విద్యార్థుల కోసం శాస్త్రవేత్తలు ఏడాదికి దాదాపు వంద గంటలు వెచ్చించాలని కోరారు. ఇటీవల కన్నుమూసిన విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ను మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయన ఎందరికో స్ఫూర్తి కలిగించారని కొనియాడారు.
Tags: Bring the findings to labs from land to land

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *