కర్షకుడిని ముంచేస్తున్న దళారీలు

Date:11/01/2019
విజయనగరం ముచ్చట్లు:
నారు వేసిన నాటి నుంచి పంట ఎదిగేవరకూ దాన్ని బతికించుకోవడానికి మట్టిమనిషి పడిన కష్టాలు అన్నీఇన్నీకావు. అదనులో వర్షాలు కురవకపోయినా ఎక్కడెక్కడి నీళ్లో మోసుకొచ్చి తడుపుకునో, మోటార్లతో పొలాలకు నీటిని తోడుకునో నానా అవస్థలు పడి పంటని బతికించుకున్నాడు. అయితే కరవు రక్కసి కారణంగా దారుణంగా నష్టపోయాడు. సగం పంటైనా మిగిలిన రైతులూ తక్కువే. మరోవైపు పంట చేతికొస్తుందనగా పెథాయ్‌ తుపాను పొలాల్లో కుప్పల్ని తడిపేయడంతో బెంగపడిపోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఏడాది ఖరీఫ్‌ అన్నదాతకు అగ్ని పరీక్ష పెట్టింది. ఇన్ని అవరోధాలు దాటుకొచ్చిన కర్షకుడిని దళారీ దారుణంగా ముంచేస్తున్నాడు. రైతు పొలంలో అడుగెట్టి దళారీ సాగిస్తున్న దందా అంతా ఇంతా కాదు.
జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 3.21 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే దాంట్లో 1.41 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనేసినట్లుగా రికార్డుల్లో నమోదైపోయింది. ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల వరకూ రావాల్సిన పనిలేకుండా కల్లం వద్దకే కేంద్రాల నిర్వాహకులు వెళ్లి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దానికోసమే కేంద్రాలకు ట్యాబ్‌లు సైతం అందించారు. దీనివల్ల రైతులకు శ్రమ తగ్గడంతో పాటు రవాణా ఖర్చులు మిగల్చాలన్నది ధ్యేయం. అయితే జిల్లాలో వెలుగు ఉద్యోగుల సమ్మె కారణంగా అసలు కొనుగోళ్ల ప్రక్రియే ప్రహసనంగా మారిపోయింది.   దళారులదే దందా అన్న రీతిలో పరిస్థితులు దాపురించాయి. కొందరు పెద్దవ్యాపారులైతే పెథాయ్‌ తుపానుని బూచిగా చూపించి ధాన్యం నాణ్యంగా లేవంటూ బెదరగొట్టి రైతుల నుంచి 80  కిలోల బస్తాకి అయిదారు కిలోలు అదనంగా లాగేస్తున్నారు.
ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల సమయంలోనే వెలుగు ఉద్యోగుల సమ్మె కచ్చితంగా దళారులకే కలిసొచ్చింది. ఎక్కడా కేంద్రాలు తెరవకపోవడంతో ఇక ఈ ఏడాదికి ఇంతేనంటూ ప్రచారం చేస్తూ ఊరూరా జల్లెడ పట్టేశారు. విచిత్రమేమిటంటే ప్రభుత్వం తరపున అంటూ గోనె సంచులు వారే రైతులకు అందించడంతో కర్షకులూ చేయడానికి ఏమీ లేకపోయింది.
మద్దతు ధర సాధారణ రకం క్వింటాలుకి రూ.1,750. రైతులు కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయట అమ్మినా సరే ఏ వ్యాపారీ ఆ ధర కంటే తక్కువ ఇవ్వడానికి లేదు. కాని జిల్లాలో వివిధ మండలాలకు చెందిన రైతులతో సహా రైతు సంఘం నాయకులు ధ్రువీకరిస్తున్న లెక్కల ప్రకారం దళారులు 80 కిలోల బస్తాకి రూ.1,300 నుంచి 1,350 వరకూ మాత్రమే ఇస్తున్నారు. అంటే క్వింటాలుకి(వంద కేజీలకు) రూ.1,625 మాత్రమే ఇస్తుండడంతో అక్కడే రూ.125 వరకూ అన్నదాత నష్టపోతున్నాడు.
మరోవైపు ప్రతీ 80 కిలోల బస్తా ధాన్యానికి తూకం సమయంలో ప్లాస్టిక్‌(మైకా) సంచులతో ధాన్యం నింపి ఏకంగా 2 కిలోల నుంచి 3 కిలోల వరకూ అదనంగా లాగేస్తున్నారు.  బొండపల్లి, గంట్యాడ, విజయనగరం, జామి, గజపతినగరం, గరివిడి, మెరకముడిదాం, పార్వతీపురం, సీతానగరం, బలిజపేట.. ఒక్కటేమిటి ఏ మండలంలో పరిశీలించినా ఈ అదనపు బాదుడు తప్పట్లేదు. రైతు అక్కడ క్వింటాలుకి మరొక రూ.40 నుంచి రూ.50 వరకూ కోల్పోతున్నాడు. అంతేకాదు రవాణా ఛార్జీలు, కూలీల ఖర్చుల నిమిత్తం బస్తాకి మరో రూ.50 చొప్పున రైతుపైనే భారం మోపుతున్నారు.
పెద్దవ్యాపారి వద్దకు వెళ్లినవారికైతే అదనపు వాత మరింత పెరిగిపోతుంది. కరవు పరిస్థితులు, పెథాయ్‌ తుపాను నేపథ్యంలో ధాన్యం నాణ్యత సరిగా లేదని, రంగు మారిపోయినట్లుగా కనిపిస్తుందని కొర్రీలు వేస్తున్నారు. మర ఆడించాక క్వింటా ధాన్యానికి 67 కిలోల బియ్యం రాదన్న వంకపెట్టి అదనంగా అయిదారు కిలోలు ఇస్తేనే తీసుకుంటామంటూ కొందరు పెద్దవ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారు. వారిని కాదని వెనక్కి తెచ్చుకుంటే రవాణా ఛార్జీల రూపేణా నష్టపోవడంతో పాటు అవస్థే మిగులుతుందన్న భయంతో రైతులు వారి చెప్పినదానికల్లా ఊకొడుతున్నారు. వీటన్నిటి ఫలితంగా ఈ ఏడాది రైతన్నకు రమారమి క్వింటాలుకి రూ.200 నుంచి రూ.250 వరకూ కోల్పోవాల్సి వస్తుంది.
ఖరీఫ్‌ ప్రారంభం నుంచే వర్షాలు లేక నారు ఎండిపోతుంటే దాన్ని బతికించుకోవడానికే రైతులు నానా అవస్థలు పడ్డారు. పంట పొట్టదశలో ఉండగా కరవు విలయ తాండవం చేయడంతో పంట ఎండిపోయి ఆవేదనతో పొలంలోకి పశువుల్ని వదిలేసిన వారెందరో ఉన్నారు. ఆ తరువాత సరిగ్గా పంట కోతలు పూర్తయి కుప్పలేస్తున్న దశలో పెథాయ్‌ తుపాను వర్షాలు దెబ్బతీసాయి. ఇన్ని అవరోధాల్ని దాటుకుని చేతికందిన ఎంతోకొంత పంటని అమ్ముకోవడానికి చూస్తే మద్దతు ధర ఇచ్చి కొనేవాళ్లు కానరాకపోగా దళారుల చేతిలో చిక్కి విలవిల్లాడుతున్నారు. విచిత్రమేమిటంటే దళారులు, పెద్దవ్యాపారులు తిరిగి అదే రైతుల పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతా సంఖ్యలు తీసుకుని వారి పేరు మీదే ప్రభుత్వ మద్దతు ధరకు దరఖాస్తు చేసేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రాజకీయ ఒత్తిళ్లతో అధికారయంత్రాంగమంతా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలొస్తున్నాయి.
Tags:Brokers scolding the coworker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *