Natyam ad

బీఆర్ఎస్ ఎంట్రీ

-ఎవరకి ప్లస్… ఎవరికి మైనస్

విజయవాడ ముచ్చట్లు:


దేశంలో తెలంగాణ మోడల్ అంటూ మొదలు పెట్టి ఏకంగా జాతీయ పార్టీనే ఏర్పాటు చేసిన కేసీఆర్ కు నిస్సందేహంగా ఆ పార్టీ ఆవిర్బావ వేడుక నిరుత్సాహాన్ని కలిగించి ఉంటుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏపీపై ఎలా ఉంటుందన్న విషయంపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఏపీలో ఏ పార్టీకి మేలు చేస్తుంది? ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుంది అన్న విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పేరు మార్చుకుని జాతీయ పార్టీ అన్నంత మాత్రాన ఆ పార్టీకి ఆదరణ వచ్చేస్తుందని భావించడం భ్రమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ ఏపీపై దృష్టి సారించడం ఇదే ప్రథమం కాదు. గతంలో అంటే రాష్ట్ర విభజన సమయంలోనే అంటే 2014 ఎన్నికలలోనే ఏపీలో తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా జగన్ కు మద్దతు పలికారు.

 

 

 

Post Midle

అయితే ఆ మద్దతు అప్పుడు ఎలాంటి ప్రభావాన్నీ చూపలేదు. అయితే ఆ తరువాతి ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో మాత్రం కేసీఆర్, జగన్ ల ‘మైత్రి’ ఇక్కడ అంటే ఏపీలో జగన్ కు ఫలించింది. అయితే అది ఏపీ జనం తెలంగాణ రాష్ట్ర సమితిని ఆదరించారని కానీ, కేసీఆర్ తెలంగాణ వాదానికి మద్దతుగా నిలిచారనీ అర్ధం కాదు.కేసీఆర్ అప్పట్లో వైసీపీకి ఇచ్చిన మద్దతు ఆర్ధిక సంబంధమైనది. హైదరాబాద్ నుంచి ఏపీలో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సహకారమూ అందకుండా కట్టడి చేయడానికి సంబంధించింది. అంతే కానీ విభజన నాటి గాయాలను ఏపీ జనం మరచిపోయారని అనుకోవడానికి లేదు. అలాగే అప్పట్లో తెలుగుదేశం పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత, జగన్, కేసీఆర్ ల మైత్రి కారణంగా 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస లబ్ధి పొందింది. అందుకు ప్రత్యుపకారంగానే 2019 ఎన్నికలలో వైసీపీకి తెరాస సహకారం అందించింది. అయితే ఈ ఐదేళ్లలో పరిస్థితులలో మార్పు వచ్చింది. అప్పటి మైత్రి ఇప్పుడు ఇరు పార్టీలూ గౌరవించి పరస్పర సహకారం అందించుకునే పరిస్థితులు లేవు. సమయం వచ్చినా రాకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా..

 

 

 

తెరాస మంత్రులు తమ పాలనను పొగుడుకునేందుకు పొరుగున ఉన్న ఏపీనీ, ఏపీలో అధ్వాన పాలననూ తూర్పారపడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ కు వైసీపీ అండగా నిలిచే అవకాశాలు అంతంత మాత్రమే. అలా కాకుండా, గత ఎన్నికలలో కలిగిన లబ్ధిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ, బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ లు జట్టు కట్టినా ఒనగూరే రాజకీయ ప్రయోజనం శూన్యమేనని అంటున్నారు.  ఎందుకంటే.. ఆ ఎక్స్ పరిమెంట్ కాలపరిమితి నాటి ఎన్నికలతోనే ముగిసింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఇప్పటి వరకూ తెలంగాణలో అధికారంలో ఉండి ఏపీ ప్రయోజనాలకు అడుగడుగునా అవరోధాలు కల్పించిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు ఏపీలో జనం మద్దతు పలకడం అనుమానమే అంటున్నారు. ఇక అదే బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల మధ్య అవగాహన ఉంటే.. 2019 ఎన్నికలలో వైసీపీకి ఒనగూరిన ప్రయోజనాలు లభించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత (యాంటి ఇంకంబెన్సీ) కారణంగా తెలంగాణలోని టీడీపీ అభిమానులు, సీమాంధ్రులు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో గత ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఏపీలో వైసీపీకి ఎటువంటి సహకారం అందిందో.. అటువంటి సహకారం ఈ సారి తెలుగుదేశంకు అందే అవకాశాలున్నాయి.అంటే పరస్పరం ఇరు పార్టీలూ లాబపడతాయన్నది పరిశీలకుల విశ్లేషణగా ఉంది. బీఆర్ఎస్, తెలుగుదేశం మైత్రిని బూచిగా చూపి ఏపీలో వైసీపీ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేసినా అది పెద్దగా ఫలితం ఇచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.

 

 

ఎందుకంటే వైసీపీ ఇంత కాలం అధికారంలో ఉండి కూడా ఆంధ్రకు తెలంగాణ చేస్తున్న అన్యాయంపై గొంతెత్తకపోవడమే కాకుండా   హైదరాబాద్ లో ఏపీకి సంబంధించిన  వేల కోట్ల రూపాయల అస్తు ల‌నుఅప్పనంగా అప్పగించి, ఇప్పుడు రాజకీయ అవసరం కనుక సెంటిమెంటును రెచ్చగొట్టాలని చూస్తే అది బూమరాంగ్ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు.  అంటే  బిఆర్ ఎస్‌, టీడీపీతో  జతకడితే దాని వల్ల తెలంగాణలో కేసిఆర్ తిరిగి అధికారం నిల బెట్టుకునే అవకాశం, ఆంధ్రలో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశానికి పెరిగిన సానుకూలతకు తోడు పోల్ మేనేజ్ మెంట్ కు  కావలసిన అదనపు హంగులు తెరాస నుంచి పొంది టీడీపీ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.అలాగే ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, ప్రదాన ప్రతిపక్షంపై ప్రజల్లో సానుకూలత ఉన్న ఈ సమయంలో ప్రయెూగాలు చేసి పాడు చేసుకోవాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఉండే అవకాశం లేదని అంటున్నారు. బీఆర్ఎస్ తో అవగాహనా, మైత్రీ, పొత్తూ లేకున్నా తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఉండదనీ అంటున్నారు.

 

 

 

ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పై ప్రజావ్యతిరేకత తీవ్రతను బట్టి చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణం ఉందన్నది ప్రస్ఫుటమౌతోంది. జనసేన వంటి పార్టీలు రంగంలో ఉన్నా.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు బలమైన విపక్షం వైపే మొగ్గు చూపుతారు తప్ప జనసేన వంటి చిన్న పార్టీలవైపు కాదని విశ్లేషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా 2019 ఎన్నికలలో దాదాపు అన్ని స్థానాలలో పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమవ్వడాన్ని ప్రస్తావిస్తున్నారు.ఇక ఇవన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ ఏపీలో సొంతంగా పోటీ చేసినా ఆ పార్టీకి పడే ఓట్లు వైసీపీ నుంచే చీలుతాయనీ, ఇది వైసీపీ విజయావకాశాలను తక్కువలో తక్కువ 15 స్థానాలలో ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో విపక్షం ఓట్లు కూడా కొన్ని బీఆర్ఎస్ వైపు మళ్లినా అది అర శాతం కూడా ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. బీఆర్ఎస్ ఏపీలో ఏ మాత్రం ప్రభావం చూపినా ఆ మేరకు తెలుగుదేశం పార్టీకే లబ్ధి చేకూరుతుందని విశ్లేషిస్తున్నారు.

 

Tags: BRS entry

Post Midle