అన్ని వర్గాలను ఆకట్టుకొనే విధంగా బడ్జెట్

Date:15/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2018ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈటల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి. సాధారణ ఎన్నికలకు ముందు కేసీఆర్ సర్కార్ ప్రవేశపెడుతున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో.. అన్ని వర్గాలను ఆకట్టుకునేవిధంగా కేటాయింపులు చేశారు. రూ. లక్షా 74 వేల 453 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ పలు పథకాలకు మంచి కేటాయింపులు చేశారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలకు అనుగుణంగా.. ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన రైతులకు పెట్టుబడి సాయం పథకానికి ప్రత్యేక కేటాయింపులు చేశారు.రైతుల పెట్టుబడి సాయం పథకం 2018 జూన్ నుంచి ప్రారంభం కానుంది. దీని కింద ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.8000 పెట్టుబడి సాయంగా అందించనున్నారు. ఇందు కోసం బడ్జెట్‌లో రూ. 15,000 కోట్లు కేటాయించారు. నీటి పారుదల రంగానికి రూ. 25,000 కోట్లు కేటాయించారు.వ్యవసాయ యాంత్రీకరణకు రూ.522 కోట్లు కేటాయించారు. అలాగే బిందు, తుంపర సేద్యానికి రూ.150 కోట్లు, పాలీ గ్రీన్‌ హౌస్‌కు రూ.120 కోట్లు కేటాయించారు. రైతులు పంటలను సేకరించిన అనంతరం కోల్డ్‌ స్టోరేజీ, లింకేజీలకు రూ.132 కోట్లు కేటాయించారు. దళితులకు భూపంపిణీకి రూ.1,469 కోట్లు కేటాయించారు.100 రోజుల్లోనే భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశామని, త్వరలో ‘ధరణి’ వెబ్‌సైట్‌ ఆవిష్కరిస్తామని ఈటల తెలిపారు. రైతు సమన్వయ సమితీలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.వ్యవసాయానికి, పరిశ్రమలకు కీలకమైన విద్యుత్‌ రంగానికి రూ.5,650 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించామని, ఇప్పుడు తెలంగాణలో కరెంట్ పోతే వార్త అవుతుందని ఈటల చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించడం తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప ప్రగతిగా అభివర్ణించారు.
Tags: Budget to impress all categories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *