మార్కెట్ లో ప్రారంభమైన భవనాలు, షెడ్ల తొలగింపు..

హైదరాబాద్: నగరంలోని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. పండ్ల మార్కెట్ ఆవరణలో ఉన్న పాత షెడ్లు, భవనాలను కూల్చేస్తున్నారు. దీంతో తమ సామగ్రి, ఇతర వస్తువులను కమీషన్ ఏజెంట్లు ట్రక్కుల్లో. తరలిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం మార్కెట్ ప్రాంగణం తాళాలు తెరిచిన మార్కెటింగ్ శాఖ.. రెండు రోజుల గడువు పూర్తి కావడంతో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలకు ఉపక్రమించింది. గతంలో పండ్ల మార్కెట్ స్థలాన్ని రోడ్లు, భవనాల శాఖకు మార్కెటింగ్ శాఖ అప్పగించిన విషయం తెలిసిందే. సువిశాల ప్రాంగణం ఉన్న ఈ మార్కెట్ యార్డులో త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు నగర శివారు బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులోనే తాత్కాలికంగా పండ్ల మార్కెట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కొహెడలో శాశ్వత మార్కెట్ పూర్తయ్యే వరకు బాటసింగారంలో పండ్ల క్రయ, విక్రయాలు సాగుతాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

Leave A Reply

Your email address will not be published.