భారీ లాభాలతో మార్కెట్లు

Date:17/05/2019
ముంబై ముచ్చట్లు:
ఇండియన్ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్లింది. ఏకంగా 500 పాయింట్లకు పైగా ర్యాలీ చేసింది. సెన్సెక్స్ 537 పాయింట్లు లాభపడింది. 37,931 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 11,407 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ముందు మార్కెట్ భారీగా పెరగడం గమనార్హం. నిఫ్టీ 50లో జీ ఎంటర్‌టైన్‌మెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ, హీరో మోటొకార్ప్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ 8 శాతానికి పైగా పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ 6 శాతం లాభపడింది. అదేసమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, యస్ బ్యాంక్, ఐఓసీ, వేదాంత, హిందాల్కో, సిప్లా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యస్ బ్యాంక్ షేర్లు 3 శాతం పడిపోయాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. ఫార్మా ఇండెక్స్ 1.5 శాతం నష్టపోయింది. మరోవైపు ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పెరిగాయి. మీడియా ఇండెక్స్ 3 శాతానికి పైగా ర్యాలీ చేసింది.
Tags; Markets with huge profits

నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

Date:09/05/2019
ముంబై ముచ్చట్లు:
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారంలో వరుసగా నాలుగో రోజు.. మొత్తంగా 7వ రోజు నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా పతనంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ఆరంభంనుంచీ బలహీనంగా కదిలిన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ ఏకంగా రెండు నెలల కనిష్ఠానికి పతనమైంది. అమెరికా-చైనా చర్చల ప్రభావం ఆసియా మార్కెట్లతోపాటు, అమెరికా, యూరప్ మార్కెట్లపైనా స్పష్టం కనిపించింది. నేటి ట్రేడింగ్‌లో చైనా మార్కెట్లు 1.8శాతం, కొరియా మార్కెట్లు 3 శాతం పతనమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 230.22 పాయింట్లు క్షీణించి 37,558.91 వద్ద, నిఫ్టీ 57.65 పాయింట్ల నష్టంతో 11,301.80 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 23 పైసలు క్షీణించి 69.94 వద్ద కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్‌లో మీడియా షేర్ల సూచీ 3 శాతం పెరగ్గా, మెటల్‌ సూచీ 1.4 శాతం క్షీణించింది.
యస్‌బ్యాంక్‌ షేర్లు 2.5 శాతం పతనమయ్యాయి. ఇండియా రేటింగ్స్‌ సంస్థ ఈ బ్యాంక్‌ దీర్ఘకాలిక రేటింగ్స్‌కు కోత విధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక ఇతర సూచీల్లో పెద్ద మార్పు లేదు.ఎన్‌ఎస్‌ఈలో.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (+7.93), యస్ బ్యాంక్‌ (+5.94), బజాజ్‌ ఫిన్‌‌సర్వ్‌ (+1.65), బజాజ్‌ ఫైనాన్స్‌ (+1.71), హీరో మోటో కార్ప్‌ (+1.52) షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. వీటితోపాటు ఐబీ హౌసింగ్, టైటన్‌, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, బ్రిటానియా షేర్లు లాభాలను ఆర్జించాయి. మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (-3.31), బీపీసీఎల్‌ (-3.09), భారతీ ఎయిర్‌టెల్ (2.79), కోల్‌ ఇండియా (-2.73), ఎన్టీపీసీ (2.73) టాప్‌ లూజర్స్‌‌గా మిగిలాయి. వీటితోపాటు ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌‌లో యస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హీరోమోటోకార్ప్, హెచ్‌యూఎల్, టీసీఎస్ టాప్ గెయినర్లుగా.. రిలయన్స్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
Tags: Stock markets in loss

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Date:30/04/2019
ముంబై ముచ్చట్లు:
ఇండియన్ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 36 పాయింట్లు నష్టపోయింది. 39,032 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 11,748 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల కారణంగా మార్కెట్ నష్టాల్లోనే ప్రారంభమైంది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. అయితే తర్వాత డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, చివరి గంటలో కొనుగోళ్లతో సూచీలు నష్టాలను పూడ్చుకోగలిగాయి. నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఐఓసీ, హెచ్‌సీఎల్, టాటా స్టీల్, బీపీసీఎల్, హిందాల్కో, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 5 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, మారుతీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 29 శాతం మేర పతనమైంది. ఆర్థిక ఫలితాలు బాగులేకపోడం ఇందుకు కారణం.
Tags: Markets ending in losses

మార్కెట్లోకి పాపప్ సెల్ఫీ కెమెరా.

Date:30/04/2019
ముంబై ముచ్చట్లు:
పాపప్ సెల్ఫీ కెమెరా.. ఇదే ప్రస్తుత ట్రెండ్. మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలన్నీ ఈ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్స్ తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వివో, ఒప్పొ కంపెనీలు ఇప్పటికే పాపప్ సెల్ఫీ కెమెరా ఫీచర్‌తో ఫోన్లను లాంచ్ చేశాయి. షావోమి కూడా పాపప్ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మి ఫోన్ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఫోన్ టీజర్ కూడా విడుదల చేసింది. ఇక వన్‌ప్లస్ కూడా ఇదే ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చే అవకాశముంది. మే 14న ఈ విషయం స్పష్టమౌతుంది. ఇప్పుడు వీటి జాబితాలో రియల్‌మి కూడా వచ్చి చేరింది. ఈ కంపెనీ కూడా సెల్ఫీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. చైనా పాపులర్ సామాజిక మాధ్యమం వీబో‌లో రియల్‌మి పాపప్ సెల్ఫీ ఫోన్ టీజర్ లీక్ అయ్యింది. ఈ ఫోన్ పేరు రియల్‌మి ఎక్స్ అయ్యిండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతిత్వరలో ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Tags: The popup cellpho camera into the market.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు 

Date:18/01/2019
ముంబై  ముచ్చట్లు:
దేశీ స్టాక్ మార్కెట్ శుక్రవారం కూడా లాభాల్లోనే ముగిసింది. ఇండెక్స్‌లు లాభపడటం ఇది వరుసగా నాలుగో రోజు. రోజంతా రేంజ్‌బౌండ్‌లో కదలాడిన ఇండెక్స్‌లు చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 36,386 పాయింట్ల వద్ద, నిఫ్టీ కేవలం 2 పాయింట్ల లాభంతో 10,907 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ 10,900 స్థాయిని రక్షించుకోగలిగింది. 890 షేర్లు లాభపడితే, 1,632 షేర్లు నష్టపోయాయి. ఇక 161 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందాల్కో, అదానీ పోర్ట్స్ షేర్లు నిఫ్టీలో టాప్ గెయినర్లుగా నిలిచాయి. అదేసమయంలో సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, గెయిల్, ఎల్అండ్‌టీ, హెచ్‌పీసీఎల్ షేర్లు టాప్ లూజర్లుగా ఉన్నాయి.
సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టపోయాయి. ఒక్క ఎనర్జీ విభాగం మాత్రం లాభాల్లో ఉంది. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ఇన్‌ఫ్రా, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇండెక్స్‌లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఫార్మా ఇండెక్స్ 3 శాతం మేర పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు దాదాపు 5 శాతం మేర పరుగులు పెట్టింది. విప్రో 3 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో సన్ ఫార్మా 9 శాతం మేర పతనమైంది. ఈ షేరు ఇంట్రాడేలో 12 శాతానికి పైగా పడిపోయింది. భారతీ ఎయిర్‌టెల్ 6 శాతానికి పైగా క్షీణించింది. గెయిల్ 3 శాతానికి పైగా, హెచ్‌పీసీఎల్ 2 శాతానికి పైగా నష్టపోయాయి.
Tags: Stock markets in profit

ముగిసిన పసిడి లాభాల రూపీ ర్యాలీ

Date:04/01/2019
ముంబై ముచ్చట్లు:
పసిడి మూడు రోజుల లాభాల ర్యాలీ ముగిసింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.145 నష్టంతో రూ.32,690కి క్షీణించింది. రూపాయితో పోలిస్తే డాలర్ బలహీనపడటం, జువెలర్ల నుంచి ఆదరణ తగ్గడం వంటి అంశాలు బంగారంపై ప్రతికూల ప్రభావం చూపాయని విశ్లేషకులు పేర్కొన్నారు. బంగారం ధర పడిపోయినా కూడా వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. రూ.40,000 మార్క్‌ను దాటేసింది. పరిశ్రమల నుంచి, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. దీంతో కేజీ వెండి ధర రూ.440 పెరుగుదలతో రూ.40,140కు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.145 క్షీణతతో రూ.32,690కి, 22 క్యారెట్ల బంగారం ధర రూ.145 క్షీణతతో రూ.32,540కి తగ్గింది. ఇక అంతర్జాతీయంగా చూస్తే బంగారం ధర ఔన్స్‌కు 0.11 శాతం క్షీణతతో 1,293.35 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లో బంగారం ధర మొత్తంగా రూ.565 మేర పెరిగింది.
Tags:The ending gains rally

లాభాలతో దేశీయ మార్కెట్లు

Date:01/01/2019
ముంబై ముచ్చట్లు:
కొత్త సంవత్సరాన్ని దేశీయ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభించాయి. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్‌ 93 పాయింట్ల లాభంతో 36,162 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 10,882 పాయింట్ల వద్ద మొదలైంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో పాటు దేశీయంగా ఐటీ, ఆటోమొబైల్‌ తదితర రంగాల షేర్లలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కోలుకున్న మార్కెట్లు చివరకు మంచి లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 186.24 పాయింట్ల లాభంతో 36,254.57 వద్ద ముగియగా, నిఫ్టీ 47.55 పాయింట్ల లాభంతో 10,910.10 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు కూడా పుంజుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 69.68 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్ (+2.24), హెచ్‌డీఎఫ్‌సీ (+2.07), హెచ్‌పీసీఎల్ (+1.36), యస్ బ్యాంక్ (+1.35), భారతీ ఇన్‌ఫ్రాటెల్ (+1.25) తదితర షేర్లు లాభపడగా.. మహింద్రా & మహింద్రా (-3.79), హిండాల్కో (-1.53), విప్రో (-1.27), ఇండియాబుల్స్ హౌసింగ్ (-1.07), హెచ్‌యూఎల్ (-1.02) తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి
15 రోజుల  స్టాక్ మార్కెట్లకు పండుగ సెలవులు
ముంబై, జనవరి 1
మనకే కాదండోయ్.. స్టాక్ మార్కెట్‌కు కూడా సెలవులు ఉంటాయి. ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు సాధారణంగా వారానికి ఐదు రోజులు  పనిచేస్తాయి. సెలవు రోజుల్లో మార్కెట్లు కూడా పనిచేయవు. కొత్త ఏడాది 2019లో స్టాక్ మార్కెట్ మొత్తంగా 15 రోజులు పనిచేయదు. ఆ రోజులు ఏంటో చూద్దాం..
2019 స్టాక్ మార్కెట్ సెలవులు
1 మహా శివరాత్రి మార్చి 4 సోమవారం
2 హోలి మార్చి 21 గురువారం
3 మహవీర్ జయంతి ఏప్రిల్ 17 బుధవారం
4 గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 19 శుక్రవారం
5 మహరాష్ట్ర దినోత్సవం మే 1 బుధవారం
6 రంజాన్ జూన్ 5 బుధవారం
7 బక్రీద్ ఆగస్ట్ 12 సోమవారం
8 స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్ 15 గురువారం
9 వినాయక చవితి సెప్టెంబర్ 2 సోమవారం
10 మొహర్రం సెప్టెంబర్ 10 మంగళవారం
11 గాంధీ జయంతి అక్టోబర్ 2 బుధవారం
12 దసరా అక్టోబర్ 8 మంగళవారం
13 దీపావళి అక్టోబర్ 28 సోమవారం
14 గురునానక్ జయంతి నవంబర్ 12 మంగళవారం
15 క్రిస్మస్ డిసెంబర్ 25 బుధవారం.
Tags:Domestic markets with profits

హాచ్‌బ్యాక్‌ ‘స్విఫ్ట్‌’ కారుకు అగ్రస్థానం

Date:25/12/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
నవంబరు నెలలో ఎక్కువగా అమ్ముడైన ప్యాసింజర్‌ వాహనాల్లో మారుతి సుజుకీకి చెందిన హాచ్‌బ్యాక్‌ ‘స్విఫ్ట్‌’ కారు అగ్రస్థానంలో నిలిచింది. నవంబరు నెల విక్రయాలకు సంబంధించి ‘సొసైటీ ఆఫ్‌ ఇండియన్ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌’ విడుదల చేసిన జాబితాలో ఈ విషయం వెల్లడైంది. నవంబరులో ఎక్కువగా అమ్ముడుపోయిన టాప్-10 వాహనాల్లో 6 కార్లు మారుతి సంస్థకు చెందినవే కావడం విశేషం. ఈ జాబితాలో మొత్తం 22,191 యూనిట్ల విక్రయాలతో ‘స్విఫ్ట్‌’ తొలిస్థానంలో ఉండగా.. మారుతి కాంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ 21,037 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. అంటే రోజుకు దాదాపు 700 కార్లకు పైమాటే.
మారుతి కంపెనీకే చెందిన ప్రీమియం హాచ్‌బ్యాక్‌ బాలెనో 18,649 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. అయితే అంతకు ముందు నెలలో అగ్రస్థానంలో ఉన్న మారుతి ‘ఆల్టో’ ఈసారి 14,378 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాతి ఐదు, ఆరు స్థానాల్లో మారుతి విటారా బ్రెజా, వేగనార్‌ వాహనాలు నిలిచాయి. జాబితాలో మొదటి 6 స్థానాలను మారుతి దక్కించుకోగా.. హ్యుందాయ్‌కు చెందిన ప్రీమియం హాచ్‌బ్యాక్‌ ‘ఎలైట్‌ ఐ20’ 10,555 విక్రయాలతో ఏడో స్థానం, ఇదే కంపెనీకి చెందిన ఎస్‌యూవీ క్రెటా 9,677 యూనిట్ల విక్రయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచాయి.
ఆ తర్వాతి స్థానాల్లో హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10, శాంత్రో పదో స్థానంతో సరిపెట్టుకున్నాయి.  ఎక్కువగా అమ్ముడైన ప్యాసింజర్‌ వాహనాల జాబితాలో శాంత్రో మళ్లీ చోటు దక్కించుకోవడం విశేషం. 2014 డిసెంబరులో శాంత్రో విక్రయాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే నాలుగేళ్ల తర్వాత.. అంటే ఈ ఏడాది అక్టోబరులో తిరిగి ఈ మోడల్‌ను హ్యుందాయ్‌ సంస్థ విడుదల చేసింది.
Tags; Hatchback is the ‘Swift’ car