దసరా నాటికి యాదాద్రి ఫస్ట్ ఫేస్ పూర్తి

Date:11/08/2018
నల్గొండముచ్చట్లు:
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఎంతో అపురూపమైన ఆళ్వారు స్తంభాల శిల్ప కళా నైపుణ్యంతో కూడిన కృష్ణశిలలతో యాదాద్రి శ్రీలక్ష్మీ నృసింహాస్వామి ఆలయం తుది రూపుదిద్దుకుంటోంది. రెండేండ్లుగా జరుగు తున్న యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యి.. దసరా నాటికి స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు కలగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృ సింహస్వామి ఆలయ కిర్తీప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్నారు. అందుకనుగుణం గా ఆ ఆలయానికి యాదాద్రిగా నామకరణం చేసి.. ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టారు. ప్రపంచ స్థాయిలో యాదాద్రి ఆలయ వైభవాన్ని కీర్తించేవిధంగా కృష్ణశిలలతో కళాసృష్టి చేయిస్తున్నారు. రూ.1900 కోట్లతో చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది అంకానికి చేరుకున్నాయి. దసరా సమ యానికి ప్రధానాలయం పనులు పూర్తి అవుతాయని, మిగతా పనులు పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టనున్నట్టు సమాచారంయాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఐదంతస్థుల ప్రధానాలయ గోపుర పనులు పూర్తయ్యాయి. గోపురానికి ముందు భాగంలో పది ద్వార పాలకుల విగ్రహాలు,ఐదు రాజ విగ్రహాలు, వెనుకభాగంలో పది ద్వార పాలకుల విగ్రహాలు, ఐదు రాజవిగ్రహాలు, నాలుగు దిక్కుల్లో ఎనిమిది సింహ విగ్రహాలను అమర్చనున్నారు. దివ్య విమాన గోపురం పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, ప్రధానాలయ ముఖమండప శ్లాబ్ పనులు పూర్తయ్యాయి. తూర్పు, ఉత్తర రాజగోపురాల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. గోపురాలకు అమర్చాల్సిన విగ్రహాల పనులు పూర్తికావొస్తున్నాయి.నిర్మాణ దశలోనే ఐఎస్‌ఓ(ఇంటర్‌నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన్) సర్టిఫికేట్ లభించడం విశేషం. ఈ సందర్భంగా ఆ సంస్థ వెరిఫికేషన్ సభ్యులు శిల్పకళను పరిపరివిధాల కొనియాడడం గమనార్హం. జూలై చివరలో ఐఎస్‌ఓ సర్టిఫికేట్‌ను యాదాద్రి ఆలయానికి ప్రదానం చేశారు. పరిపాలన నిర్వహణ విభాగంలో ఐఎస్‌ఓ సర్టిఫికెట్ పొందిన దేవాలయంగా యాదాద్రి ఆలయం సరికొత్త చరిత్రను సృష్టించింది.. ప్రాచీన శిల్పకళా సౌందర్యం.. కృష్ణశిలల నిర్మాణాలు.. ఎత్తయిన గోపురాలు.. అద్భుతమైన కళాసంపద.. తంజావూరు శిల్ప నిర్మాణ రీతి.. ప్రాకారాల సౌందర్య ప్రగతి.. శిల్పుల కళాసృష్టి.. వెరసి అత్యద్భుత శిల్పాకళా క్షేత్రంగా, ఆధ్యాత్మిక రాజధానిగా యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహాస్వామి దేవాలయం రూపుదిద్దుకుంటోంది. యాదాద్రి ప్రధానాలయంలో 12 అడుగుల ఎత్తులో 12 ఆళ్వారు స్తంభాలు, 12 అడుగుల కాకతీయ స్తంభాలు ఇప్పటికే ప్రతిష్టించారు. ఇలాంటి నిర్మాణాలు రాజుల కాలంలోనే జరిగాయని, కాకతీయ రాజవంశీయుల తర్వాత ఇంతటి భారీ నిర్మాణాలు ఎక్కడా చేపట్టలేదని ఆధ్యాత్మిక వేత్తలు ప్రశంసిస్తున్నారు.సీఎం కేసీఆర్ దేవాలయ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో నిర్మాణ పనులు వేగంగా జరగడంతో పాటు కళా వైభవానికి దర్పణం పడుతున్నాయి. దసరా నాటికి లక్ష్మీనృసింహుడి దర్శన భాగ్యం భక్తులకు దక్కాలన్న ఉద్దేశంతో నిత్యం అధికారులు, స్థపతులు, ఆలయ సిబ్బంది దగ్గరుండి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. 14.11 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ అభివృద్ధి , 2.10 ఎకరాల విస్తీర్ణంలో ప్రధానాలయం, ప్రాకారం మండపాలతో నిర్మాణం జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రధానాలయంలో ఆరున్నర అడుగుల ఎత్తులో విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు. ముఖమండపంలో ఏర్పాటు చేస్తున్న ఉపాలయాల్లో విగ్రహాలు ఆకర్షణీయంగా రూపొందాయి. కాకతీయుల కాలంలో చేసిన ఆలయాల పనుల మాదిరిగా ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రి ఆలయ పనులు కొనసాగుతున్నాయి. కొండపైన ఏడు గోపురాలతో పాటు కొండకింద మెట్ల వద్ద రూ.కోటితో గోపురం నిర్మాణం చేస్తున్నారు. యాదాద్రి దేవాలయ పనుల్లో ఎక్కడ చూసినా శిల్పకళ ఉట్టిపడుతోంది. నిర్మాణ శైలి అబ్బురపరుస్తోంది. అష్టభుజి ప్రాకారానికి రాతిశిలతో 32 స్తంభాలు అమరుస్తున్నారు. బాహ్య ప్రాకార మండపాన్ని దేవతా, జంతు, పక్షు, పుష్ప, పత్ర, లత శిల్పాల అల్లికలతో సుందరంగా నిర్మిస్తున్నారు. సప్త గోపురాలు, ప్రధానాలయ ప్రాకార మండపాలను ఆధార శిల నుంచి శిఖరం వరకు కృష్ణరాతి శిలలతో తంజావురు శిల్ప నిర్మాణరీతిలో కొనసాగిస్తున్నారు. అష్ట దిక్పాలకుడైన స్వామివారికి ఆలయ బాహ్యప్రాకార మండపాన్ని అష్టభుజి ప్రాకారంగా, అద్భుతంగా డిజైన్ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏనుగు బొమ్మల మధ్యభాగాన అందమైన బాలపాదం స్తంభాలతో నిర్మిస్తున్నారు. బాహ్య ప్రాకారానికి నలుదిశలా 32 బాలపాద స్తంభాలను అమర్చుతున్నారు. నిష్ణాతులైన శిల్పుల చేతిలో ప్రాణం పోసుకుంటున్న ఈ శిల్పాలకు వైటీడీఏ స్థపతులు సుందరరాజన్, డాక్టర్ ఆనందచార్యుల వేలు డిజైన్లను అందించడమే కాకుండా.. తీర్చిదిద్దే పనులను పర్యవేక్షిస్తున్నారు. అద్భుత రాతిశిల్ప కళారాజమైన బాలపాదం ఆలయ నిర్మాణ చరిత్రలో అరుదైన కట్టడంగా నిలిచిపోవడం ఖాయం.
Tags:By the time of Dasara the first face of the Yadavri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *