Natyam ad

దుమారం రేపుతున్న పంచాయితీ నిధుల లెక్క

నిజామాబాద్ ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నిధుల పంచాయతీ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఉద్దేశపూర్వకంగానే మోడీ సర్కార్ తెలంగాణను ఇబ్బందులకు గురి చేస్తోందని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే టీఆర్ఎస్ సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల కేంద్రం వద్ద పెండింగ్ లో రూ.వందల కోట్లు మూలుగుతున్నట్లు తాజాగా వార్తలు రావడం సంచలనం అవుతోంది. ఈ మేరకు రాష్ట్రానికి తాము కోరిన నివేదికను ఇచ్చి మీ డబ్బులను మీరు తీసుకోండని లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.ధాన్యం కొనుగోళ్లపై ఆడిట్ నివేదికలు ఇవ్వాలని కేంద్రం కోరుతోంది. ఈ నివేదికలు పంపి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. అయినా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుండి స్పందన రావడం లేదని తెలుస్తోంది. 2014-15 నుండి ఆడిట్ నివేదికలు కేంద్రానికి అందడం లేదట. ఆ నివేదికలు చేరవేయకపోవడంతో కేంద్రం వద్ద రూ.వందల కోట్లు పెండింగ్ లో పడిపోయినట్లు తెలుస్తోంది. ఇకనైనా నివేదికలు పంపాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా మరో లేఖ రాయడంతో అధికారులు ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.రాష్ట్రం నుంచి బియ్యం సరఫరా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి 90-95 శాతం వరకు నిధులు విడుదల చేస్తుంది. ఆడిట్ నివేదికలు అందాక మిగిలిన మొత్తాన్ని రిలీజ్ చేస్తుంది. ఏటా రెండు సీజన్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయిన తర్వాత ఏడాదిలోగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆడిట్ నివేదికలను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రం ఏర్పడిన ఏడాది 2014-15 వానాకాలపు సీజన్ నుంచి అధికారులు ఈ నివేదికలు పంపకపోవడంతో రూల్స్ ప్రకారం ఎఫ్ సీఐ 5 శాతం నిధులను విడుదల చేయడం లేదట. ఈ ఏడేళ్లుగా ప్రతిఏటా ఐదు శాతం నిధులు కేంద్రం వద్దే ఉండిపోతున్నాయి. ఇదిలా ఉంటే నిధుల సమీకరణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇన్నేళ్లుగా ఆడిట్ నిర్వహణకు ఎందుకు ఇంత జాప్యం చేస్తోందనే సందేహాలు హాట్ టాపిక్ గా మారాయి.

 

Tags: Calculation of provocative panchayat funds

Post Midle
Post Midle