కర్ణాటకలో మళ్లీ క్యాంపు రాజకీయాలు

Date:14/09/2018
బెంగళూర్ ముచ్చట్లు:
క్యాంపు రాజకీయాలను నడిపేందుకు వీలులేదు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే ఇప్పుడు లక్ష్యం. రెండు ప్రధాన పార్టీలకూ ఇప్పుడు ఇదే సమస్య. 37 మంది శాసనసభ్యులతో ముఖ్యమంత్రి పదవిని గెలుచుకున్న జేడీఎస్ కు మాత్రం ఆ భయం లేకపోవడం విశేషం.
కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో కంగారు మొదలయింది.ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావు కొంత అనుమానం ఉన్న ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ సభ్యులు చేజారిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఢిల్లీలో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాలరావు నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే తమ పార్టీ నుంచి వెళ్లరని మల్లికార్జున ఖర్గే, దినేశ్ గుండూరావుపైకి చెబుతున్నా లోపల మాత్రం అనుమానాలు లేకపోలేదు. ఆపరేషన్ కమలం స్టార్ట్ అయిందని అనుమానిస్తున్న కాంగ్రస్ నేతలు అప్రమత్తమయ్యారు.మరోవైపు బీజేపీ ఆపరేషన్ కమల స్టార్ట్ చేసినట్లే కన్పిస్తోంది.
పథ్నాలుగు నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఏమాత్రం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చి చేరితే ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఉత్తమమని కొందరు బీజేపీ నేతలు రాష్ట్ర నేతలపై వత్తిడి తెస్తున్నారు.
దీనికితోడు అసమ్మతి నేతలు రమేష్ జార్ఖిహోళి, సతీష్ జార్ఖిహోళి, సుధాకర్, శ్రీనివాసమూర్తి, నాగేశ్ లు రహస్యంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేయాలా? బీజేపీలోకి వెళ్లాలా? అన్నదానిపై వీరు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.
దాదాపు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావు అనడం చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు ఎమ్మెల్యేలకు సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ మారితే అనర్హత వేటు తప్పదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా దాన్ని స్పీకర్ ఆమోదించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని దినేశ్ గుండూరావు హెచ్చరికలు పంపారు.
ఒకవేళ పార్టీ మారితే అనర్హత వేటు ఉండదని, రాజీనామా చేసినా ఆమోదించబోమని పరోక్షంగా ఆయన తేల్చి చెప్పారు. ఇలా బీజేపీ, కాంగ్రెస్ లు మైండ్ గేమ్ తో కర్ణాటక రాజకీయాలను వేడెక్కించాయి.
Tags: Camp politics again in Karnataka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *