కర్ణాటకలో ముందే క్యాంప్ రాజకీయాలు

Date:15/05/2019
బెంగళూర్ ముచ్చట్లు:
కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల్లో టెన్షన్ ప్రారంభమయింది. మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 21, జనతాదళ్ ఎస్ ఏడు స్థానాల్లో పోటీ చేశాయి. భారతీయ జనతా పార్టీ మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సుమలతకు మద్దతిచ్చి మిగిలిన 27 స్థానాల్లో బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ ఎస్ ల పార్టీ అధినేతల మధ్య కుదిరిన అవగాహన క్యాడర్ లో కుదరలేదు. దీంతో పది స్థానాలకు మించి ఈ కూటమికి రావని లెక్కలు కడుతున్నారు.మరోవైపు భారతీయ జనతా పార్టీ కర్ణాటక పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కనీసం పదిహేడు నుంచి ఇరవై స్థానాల్లో విజయం తథ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప గట్టిగా చెబుతున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య తలెత్తిన విభేదాలే తమకు అనుకూల ఫలితాలనిస్తాయని బీజేపీ బలంగా నమ్ముతుంది. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే సంకీర్ణ సర్కార్ పతనం ఖాయమంటూ యడ్డీ పదే పదే వ్యాఖ్యలు చేస్తుండటం ఇందుకు నిదర్శనం.కౌంటింగ్ జరిగే ఈ నెల 23వ తేదీన తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ బెంగళూరులోనే ఉండాలని యడ్యూరప్ప అల్టిమేటం జారీ చేశారు. దాదాపు 20 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు తమతో టచ్ లో ఉన్నారని ఆయన చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమకు ఎటూ అనుకూలంగా ఉంటాయి కాబట్టి మే 23వ తేదీ నుంచే ఆపరేషన్ కమల్ ను తిరిగి ప్రారంభించాలన్నది యడ్యూరప్ప యోచనగా కన్పిస్తోంది.దీంతో కాంగ్రెస్ పార్టీ సయితం మే 23వ తేదీన వచ్చే ఫలితాలను బట్టి క్యాంపులకు సిద్ధమవుతోంది. యడ్డీ వ్యాఖ్యలతో అనుమానం ఉన్న ఎమ్మెల్యేలపై ఇప్పటికే కుమారస్వామి నిఘా పెట్టింది. ఫలితాల సరళిని బట్టి వ్యూహరచన చేయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. తమ పార్టీకి టచ్ లో బీజేపీకి చెందిన 40 మంది శాసనసభ్యులున్నారని సిద్ధరామయ్య మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. మొత్తం మీద కర్ణాటక రాజకీయాలు ఫలితాలకు ముందే వేడెక్కాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Tags: Camp politics before in Karnataka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *