Natyam ad

ఏపీ భవన్ లెక్క తేలేనా

న్యూఢిల్లీ ముచ్చట్లు:

విభజన హామీల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్‌ను ఏపీకి, తెలంగాణకు విభజించే ప్రక్రియలో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. భూములు, భవనాల విభజనపై గతంలో ఆంధ్రప్రదేశ్ మూడు ప్రతిపాదనలు చేసింది. ఆస్తుల విభజనపై తాజాగా తెలంగాణ మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. గోదావరి, శబరి బ్లాకులు, నర్సింగ్‌ హాస్టల్‌ పక్కనే ఉన్న ఖాళీ స్థలం తమకు ఇవ్వాలని తెలంగాణ ప్రతిపాదించగా, కేంద్ర హోంశాఖ మాత్రం తెలంగాణ ప్రతిపాదనకు పూర్తిగా భిన్నంగా ప్రతిపాదన చేసింది. 7.64 ఎకరాల పటౌడీ హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని, మిగిలిన 12.09 ఎకరాల ఖాళీ భూమి ఏపీ తీసుకోవాలని ప్రతిపాదించింది. ఆ ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది. ఏపీకి అదనపు భూమి దక్కితే తెలంగాణకు ఏపీ నుంచి భర్తీ చేసుకోవాలని సూచించింది.ఈ ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనకు సంబంధించి దీనిపై ఇప్పటికే చాలామార్లు సమావేశాలు జరిగాయి. తెలంగాణ చేసిన ప్రతిపాదనలను ఏపీ తిరస్కరించడంతో సమస్య పరిష్కారం కాలేదు. పదే పదే జాప్యం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఏపీ భవన్‌ సముదాయంలోని భవనాలను రెండు రాష్ర్టాలు ఉపయోగించుకుంటున్నాయి. దీని ఆస్తులను పంచేందుకు ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఇటీవలే కీలక సమావేశాన్ని కూడా నిర్వహించారు.కేంద్ర, రాష్ట్ర సంబంధాల సంయుక్త కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌ జిందాల్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అయితే, తెలంగాణ నుంచి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కే రామకృష్ణారావు,

 

 

 

తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌.. ఏపీ నుంచి ఎస్‌ఎస్‌ రావత్‌, ఏపీ రీ ఆర్గనైజేషన్‌ సెక్రటరీ ప్రేమ్‌చంద్రారెడ్డి, రెసిడెంట్‌ కమిషనర్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, ఏఆర్సీ హిమన్షు కౌశిక్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తాజాగా ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోం శాఖ పై ప్రతిపాదనలు చేసింది.పటౌడీ హౌస్‌లో తమకున్న ఏడెకరాలకు పైగా స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని ఏపీ అధికారులను తెలంగాణ ప్రభుత్వం గతంలో చాలాసార్లు కోరింది. నిజాం నిర్మించిన హైదరాబాద్‌ హౌస్‌కు అనుకొని ఉన్న స్థలంతో రాష్ట్ర ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచి చెబుతూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో శబరి బ్లాక్‌ అనేది గవర్నర్‌‌కు విడిది కేంద్రంగా ఉండేది. దీంతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు ఇందులోనే బస చేసేవారు. శబరి, గోదావరి బ్లాక్‌ల మధ్య రోడ్డు ఉంది. శబరి బ్లాక్ సైతం తెలంగాణకే కావాలని అధికారులు కోరారు.

 

Post Midle

Tags; Can AP Bhavan do the math?

Post Midle