Can God have mercy?

Can God have mercy?

Date:27/05/2018
యాదాద్రి ముచ్చట్లు :
దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదనట్లుంది యాదాద్రి జిల్లాలోని రైతన్నల పరిస్థితి. మరో వారంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్నా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సన్నద్ధత అంతంతమాత్రంగానే ఉందని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ప్రకటించింది. దీనికి ప్రకారం ఏ పంటలు పండించాలో వ్యవసాయశాఖ అధికారులు కర్షకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సలహాలు ఇవ్వాలి. అయితే వారు ఇతరత్రా పనుల్లో మునిగిపోయారని అంతా అంటున్నారు. ఏటా ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే ఆహార ధాన్యాలు, ఇతర పంటల సాగుబడికి సంబంధించి ఎంత విస్తీర్ణంలో సాగు వేయాలి, పంట ఉత్పత్తి లక్ష్యాలు, రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా తదితర అంశాలపై వ్యవసాయ శాఖ ఇప్పటికే సమగ్ర నివేదికను సిద్ధం చేయాలి. ఐదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యాయన్నది పరిగణనలోకి తీసుకొని ఆ లెక్క ప్రకారం ఈ ఏడాది సాగు విస్తీర్ణం ఖరారు చేయాలి. ఇప్పటి వరకూ వీటన్నింటిపై సరైన కసరత్తే చేయడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తొలకరికి ముందే రైతులు ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకుంటారు. ఎరువులకు సంబంధించిన సమాచారమూ అందుబాటులో లేకపోవడంపై రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు బ్యాంకులు ఇచ్చే రుణ ప్రణాళిక సైతం సిద్ధంగా లేదన్న వాదన వినిపిస్తోంది.
ప్రభుత్వం ఇచ్చే సాయంతో పాటు రైతులు పెట్టుబడి కోసం రైతులు బ్యాంకులపైనే ఆధారపడుతున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాది రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఇంకా ఖరారు చేయలేదని రైతన్నలు చెప్తున్నారు. దీంతో రుణాల పంపిణీలోనూఇబ్బందులు తప్పవన్న భావన రైతుల్లో నెలకొంది. ఈ ఏడాది వర్షాభావం ఆశాజనకంగానే ఉంటాయని తేలడంతో రైతులు ఉత్సాహంగా సాగుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో పంట పెట్టుబడి కోసం అందిస్తున్న ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీ గ్రామాల్లో జోరందుకుంది. ఇదిలాఉంటే ఏటా రైతన్నకు సాగు ఖర్చు ఎక్కువవుతోంది. డీజిల్‌ ధరలు జీవితకాల గరిష్ఠానికి చేరడంతో ట్రాక్టర్‌ కిరాయి, కూలీలు, ఎరువులు, విత్తనాలు కలిపి ఎకరానికి పెట్టుబడి దాదాపు రూ.25 వేల వరకు అవుతుందని సమాచారం. దీంతో రైతులు అప్పులు చేస్తూ పంటలు పండిస్తున్నారు. బ్యాంకుల ద్వారా సకాలంలో రుణం రాకుంటే వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలు అప్పు చేసి పంటలు వేస్తున్నారు. ఇంత చేసినా పంటకు గిట్టుబాటు ధర వద్ద మాత్రం రైతుకు సమస్యలు తప్పడంలేదు. మొత్తంగా వివిధ కారణాలతో రైతన్నలకు ఆర్ధికంగా ప్రయోజనాలు చేకూరడంలేదు. అందుకే రైతులకు సకాలంలో రుణాలు అందించేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. వ్యవసాయ శాఖ సైతం పంటల ప్రణాళికలను సిద్ధం చేసి ఏ పంటలు వేస్తే బాగుంటుందో రైతులకు సూచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:Can God have mercy?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *