రామసముద్రంలో పాడి పశువుల పట్ల జాగ్రత్తలు అవసరం-లంపి స్కిన్ నివారణకు చర్యలు
రామసముద్రం ముచ్చట్లు:
ప్రస్తుత పరిస్థితిలో పాడి ఆవులకు వ్యాపిస్తున్న లంపి స్కిన్ వ్యాధిపట్ల రైతులు జాగ్రత్త వహించాలని పశువైద్యాధికారి దివ్య తెలిపారు. సోమవారం మండలంలోని కుదురు చీమలపల్లి, మూగవాడి, చెంబకూరు, ఆర్. నడింపల్లి, అరికెల పంచాయితీలలో లంపి స్కిన్ వ్యాధిపట్ల పశువులకు వ్యాక్సినేషన్ చేశారు. అలాగే పశువుల శరీరంపై ఏర్పడుతున్న లంపి స్కిన్ బొబ్బలకు మందులు పిచికారి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడి పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే లంపి స్కిన్ వ్యాధి ని నివారించవచ్చున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న పశువులను ఇతర పశువులకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే నిత్యం పశువుల పాకలో వేపాకు పొగ వేసుకోవాలన్నారు. అలాగే పాకను పరిశుభ్రంగా ఉంచుకొని తమలపాకులు, బెల్లం, మిరియాలు, పసుపు, ఉప్పు, అల్లం మిశ్రమాన్ని తినిపించాలన్నారు. కర్ణాటక నుంచి ఎట్టి పరిస్థితులను పశువులను దిగుమతి చేసుకోవద్దన్నారు. కర్ణాటక నుంచి అధికంగా ఈ వ్యాధి వ్యాపిస్తుందని సూచించారు. ఆర్బికె పరిధిలో ఉన్న సిబ్బంది ఎప్పటికప్పుడు నివేదికను అందజేయాలని సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశువైద్యా సహాయకులు శిరీష, శేషాద్రి, రెడ్డెప్ప, ఆర్బికె సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Tags; Care needed for dairy cattle in Ramasamudra-Measures to prevent lumpy skin
