గాడిద బ‌రువులు మోస్తున్నాయ్ 

Date:23/10/2020

నిజామాబాద్ ముచ్చట్లు:

భారీగాకురుస్తున్న వానలతో చేతికి వచ్చిన పంటలు కూడా నాశనమయ్యాయి. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు.అలాగే పండిన పంట వర్షాలకు తడిచిపోవటంతో దాన్ని గట్టుకు తెచ్చుకునే దారి కూడా లేక రైతన్నలు విలవిల్లాడుతున్నారు. పొలంలో ధాన్యాన్ని ఇంటికి తేవాలంటే ట్రాక్టర్లు పొలాల్లోకి వెళ్లలేనిపరిస్థితి.దీంతో రైతన్నలకు సహాయంగా..పొలంలో పంటను ఇంటికి చేర్చటానికి గాడిదలుసహాయంగా నిలుస్తున్నాయి.బరువులు మోసే గాడిదల సహాయంతో రైతులు పొలంలో తడిపోయిన ధాన్యాలను ఇంటికి చేర్చుకుంటున్నారు. వానలతో పంట నాశనం అయి సతమతం అవుతున్న కామారెడ్డి జిల్లా రైతులను ఆదుకోవడానికి ఆపద్భాంధవుల్లా గాడిదలు వచ్చాయి.తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పొలాల్లో చేతికొచ్చిన పంటలు సర్వనాశనం అయ్యాయి. ఈ క్రమంలో వచ్చినకాడికి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుందామంటే తెచ్చుకోలేని పరిస్థితి. ఎడ్ల బండి పోయినా, ట్రాక్టర్లు వెళ్లినా పొలాల్లో దిగబడిపోయే పరిస్థితి ఉంది. దీంతో ఆ రైతులకు గాడిదలు మేమున్నాం అంటూ సహాయం చేస్తున్నాయి. గత ఏడాది వర్షాకాలంలో కూడా రైతన్నలకు సహాయంగా గాడిదలు తోడుగా నిలిచాయి.

 

 

ఈసారి కూడా వచ్చి అవి రైతన్నకు అండగా నిలుస్తున్నాయి.పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్రలోని నార్సీ , దెగ్లూర్, ముత్కేడ్.. కర్ణాటక ప్రాంతంలోని ఔరద్, బీదర్ తదితర ప్రాంతాల నుంచి గాడిదలను తీసుకుని తెలంగాణకు వలస వస్తున్నారు. జిల్లాలోని నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగంపేట్, నిజాంసాగర్, బాన్సువాడ తదితర ప్రాంతాలకు వీరు వలస వచ్చి నెల రోజుల వరకు ఉంటున్నారు.ఈ క్రమంలో రైతులకు వారి గాడిదలు రైతులకు అక్కరకు వస్తున్నాయి. గాడిదలపై ధాన్యాన్ని రవాణా చేసేందుకు డబ్బులు ఆశించకుండా రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని మాత్రమే తీసుకుంటున్నారు సదరు వలసదారులు. దీంతో వలసదారులకు ఉపాధి దొరికింది..ఇటు రైతుల ధాన్యం ఇంటికి చేరే దారి దొరికింది. రైతు ఇంటికి లేదా ధాన్యం కొనుగోలు కేంద్రానికి 20 బస్తాలకు ఒక బస్తా ధాన్యాన్ని రవాణా ఛార్జీల కింద తీసుకుంటున్నారు. ఒక గాడిద డెబ్బై నుంచి ఎనభై కిలోల బరువు గల ధాన్యాన్ని మోస్తున్నాయి.దీనిపై సదరు రైతులు కూడా వర్షాలకు పంట నాశనమైనా కొంతలో కొంత అయినా గాడిదల వల్ల పంటను ఇంటికి తెచ్చుకోగలుగుతున్నామని అంటున్నారు.

 

 

భారీగా కురిసిన భారీ వర్షాలకు పంటలు బాగానే పండాయి. కానీ ఆ వర్షాలే పంట చేతికి వచ్చే సమయానికి విరుచుకుపడి పంటల్ని పాడు చేశాయని అంటున్నారు. ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకోవటానికి పంట పొలాలకు వెళ్లేందుకు ఎలాంటి వాహనాలు రాకపోతుండటంతో ఈ గాడిదలు మాకు అండగా ఉంటున్నాయని రైతులు అంటున్నారు.మరోపక్క గాడిదల యజమానులు కూడా మాట్లాడుతూ..మా ప్రాంతంలో పనులు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చేది. కుటుంబాలు గడవటం కష్టమైంది. దీంతో తెలంగాణకు వలస వచ్చాం. ఇక్కడ పని దొరకడంతో కాస్తలో కాస్త తినటానికి తిండి దొరుకుతోంది. జీవనోపాధి పొందుతున్నాం. మాకు గోధుమ, పత్తి, మినుములు, శనగలు, పెసర్లు వంటి పంటలే పండుతాయి కానీ..వరి పండదు. అందువల్ల మాకు ఏడాదికి సరిపడా వరి ధాన్యాన్ని మా గాడిదల కష్టం ద్వారా సంపాదించుకుంటాం’ అని వలస కార్మికులు చెబుతున్నారు.

రబీకి రెడీ అవుతున్న వ్యవసాయం

Tags; Carrying donkey weights

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *