నెంబర్ ప్లేట్లు లేని వాహనదారులపై కేసులు- ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్
పెద్దపల్లి ముచ్చట్లు:
వాహనదారులు నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే కేసులు నమోదు చేస్తామని పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ళలో నంబర్ ప్లేట్లు లేని వాహనాలను అదుపులోకి తీసుకొని జరిమానాలు విధించారు. అనంతరం వాహనదారులు నంబర్ ప్లేట్లు వేసుకున్న తర్వాత వాహనాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ వాహనదారులు చలాన్లు తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నారని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా శాఖ నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పవన్నారు. వాహనదారులు కచ్చితంగా ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. పట్టణంలో ప్రతినిత్యం వాహనాల తనిఖి నిర్వహించడంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష పడుతుందన్నారు.
Tags: Cases against motorists without number plates- Traffic CI Anil Kumar