ఉప్పు రైతులకు కాసులు

ఒంగోలు ముచ్చట్లు:


ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉప్పురైతుల దశ తిరిగింది. వాతావరణం పూర్తిగా అనుకూలించడంతో ఉప్పుసాగు జోరుగా సాగుతోంది. ధరలు సైతం ఊహించని విధంగా పెరగడంతో తెల్ల బంగారం కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా ధర కేవలం రూ. 70 మాత్రమే ఉండేది. ప్రస్తుతం రూ. 300 పలుకుతోంది. యాబై ఏళ్లలో ఇంత ధర ఎప్పుడూ లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి.  ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల్లోని కొఠారుల్లో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. వర్షాకాలం మినహా మిగిలిన కాలాల్లో దాదాపు 9 నెలల పాటు ఉప్పు సాగు చేస్తారు. ప్రతి నెల సుమారు 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి అవుతోంది. సుమారు 7 వేలకు పైగా ఉప్పు రైతులు, 10 వేలకు పైగా కూలీలకు ఉపాధి పొందుతున్నారు.

 

 

ప్రస్తుతం ఉప్పు ధర నాణ్యతను బట్టి 75 కేజీల బస్తా రూ.300 వరకు పలుకుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.270 పలికింది. ఇదే అత్యధిక ధర అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు ధరలు మరింత పెరిగాయి. ఈ ఏడాది తమిళనాడులో అధిక వర్షాలతో ఉప్పు ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో తమిళనాడు వ్యాపారులు రాష్ట్రానికి రావడంతో ఏప్రిల్‌లో ధరలు బాగా పెరిగాయి. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా రూ.75 లకు కూడా ధర రాని దుస్థితి. దీంతో చాలా మంది ఉప్పు రైతులు సాగుకు సెలవు ప్రకటిద్దామనుకున్నారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంతో పాటు, తెలంగాణ, మహారాష్ట్ర  ఉప్పు సరఫరా అవుతోంది.

 

Tags: Cash for salt farmers

Leave A Reply

Your email address will not be published.