సుప్రీంకోర్టుకు సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ దర్యాప్తు నివేదిక 

CBI Director in the Supreme Court

CBI Director in the Supreme Court

 Date:16/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసిన కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) దానికి సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. ఆ నివేదిక కాపీని కోర్టు ఈరోజు సీల్డ్‌ కవర్‌లో ఆలోక్‌ వర్మకు అందజేసింది. ఈ నివేదికపై సోమవారం లోగా స్పందించాలని కోర్టు ఆయనను ఆదేశించింది. తన స్పందనను కూడా కోర్టులో సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని తెలిపింది. సీబీఐ ప్రతిష్ఠను, సంస్థపై ప్రజా విశ్వాసాన్ని కాపాడేందుకు ఈ విధంగా అడిగినట్లు కోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తును అత్యంత గోప్యంగా ఉంచే విషయంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఆలోక్‌ వర్మపై సీవీసీ‌ ఇచ్చిన నివేదిక రకరకాల అభిప్రాయాలను వెలిబుచ్చిందని, వాటిలో కొన్ని అంశాలపై ఇంకా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.సీవీసీ నివేదిక కాపీని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు, సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాలకు కూడా అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సోమవారం ఆలోక్‌ వర్మ తన సమాధానం ఇచ్చిన అనంతరం మంగళవారం తదుపరి విచారణ జరుపుతామని వెల్లడించింది. సీవీసీ నివేదికను తనకు కూడా ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఆలోక్‌ వర్మ, రాకేశ్‌ అస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం వల్ల వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలోక్‌ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ దర్యాప్తు చేపట్టింది.
Tags:CBI Director in the Supreme Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *