గొల్లపూడిలో వెల్లివిరిసిన సంక్రాంతి సంబరాలు

Celebrating Sankranthi in Gollapudi

Celebrating Sankranthi in Gollapudi

Date:14/01/2019
విజయవాడ రూరల్ ముచ్చట్లు:
 రైతులన్న సంక్రాంతి పర్వదినం సందర్భంగా సోమవారం తెల్లవారుఝాము నుంచి గొల్లపూడి గ్రామంలో సంక్రాంతి సంబరాలు వెల్లివిరిసాయి.  గ్రామంలోని అన్ని పురవీధులు విద్యుత్ వెలుగులతో, తోరణాలతో, ఫ్లెక్సీలతో జిగేల్ మని మెరిసాయి.  గొల్లపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ మరియు వివిధ శాఖల అధికారులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రెండు రోజుల ముందునుంచే గ్రామంలో ఘనంగా ఏర్పాట్లను పూర్తి చేసారు. ఏపీ జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం తెల్లవారుఝాము ఐదుగంటలకే సాంప్రదాయ దుస్తులు పంచకట్టు కట్టి సంబరాలకొచ్చారు.  సన్నాయి మేళాలు, గంగిరెద్దులు, హరిదాసులు, చెక్కభజనలు, కోలాటాలతో మంత్రి దేవినేని ఉమను స్వాగతిస్తూ ఆహ్వానాలు పలికారు.
గరగనృత్యం, డప్పులు, కథాకళివేషాలు, భేరినృత్యం, హనుమంతుడి వేషాలు, పులివేషాలు, కర్రసాములు, తీన్మార్ బృందాలు వారి వారి సాంప్రదాయ నృత్య భంగిమలతో ప్రజల్ని విశేషంగా ఆకర్షించాయి. మంత్రి ఉమా సైతం కళాకారులందరి దగ్గరకు స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఫోటోలు దిగారు. అనంతరం పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధులకు, వితంతువులకు,  వికలాంగులకు పెన్షన్లను పదిరెట్లు పెంపును పురస్కరించుకొని తెదేపా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ బొమ్మకు మంత్రి దేవినేని ఉమా సమక్షంలో వందలాది మంది కార్యకర్తలు క్షీరాభిషేకం చేసారు.  ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా పెన్షన్ల పథకం ప్రవేశపెట్టిన ఆరాధ్యదైవం ఎన్.టి.రామారావు అని తెలిపారు. 
29 రాష్ర్టాలకు ఆదర్శంగా తొలుత ఐదురెట్లు పెన్షన్లు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 సంక్రాంతి కానుకగా మరో ఐదురెట్లు పెంచి  దేశంలోనే నిరుపేదలకు పదిరెట్లు పంఛన్లను పెంచి ఇస్తున్న పెద్దకొడుకు అని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రజా రాజధాని అమరావతిలో గొల్లపూడి గ్రామంలో మరో కూకట్ పల్లిగా అభివృద్ధి చెందుతుందని, కృష్ణానదిపై రూ.1387 కోట్లతో కూచిపూడి నాట్యభంగిమ ఐకానిక్ బ్రిడ్జి, రూ.745.65కోట్లతో రాజధాని తాగునీటి అవసరాలకు నీటిశుద్ధి ప్లాంట్ శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగటంతో  కృష్ణాతీర ప్రాంతం మహోన్నతంగా అభివృద్ధి చెందుతుందని, తద్వారా రాష్ర్టంలోని 13జిల్లాలకు సుభిక్షమైన మేలు జరిగితీరుతుందని మంత్రి దేవినేని ఉమా ఆకాంక్షించారు.
Tags:Celebrating Sankranthi in Gollapudi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *