Date:23/11/2020
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశంలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్న వేళ కేంద్ర ప్రభుత్వం టీకా పంపిణీ కోసం అన్ని రకాలుగా సిద్ధం చేస్తోంది. వ్యాక్సిన్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడానికి సరికొత్త యాప్‌ను రూపొందించింది. కొవిన్ పేరుతో అభివృద్ధి చేసిన ఈ యాప్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన సంసిద్ధతపై ప్రధాని మోదీ శుక్రవారం సమావేశం నిర్వహించారు.కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యలు, జాగ్రత్తల విషయంలో ‘ఆరోగ్య సేతు’ యాప్ పోషించిన పాత్రను.. వ్యాక్సిన్ లభ్యత, పంపిణీకి సంబంధించిన వివరాల విషయంలో కొవిన్ మొబైల్ యాప్ పోషించనుంది. వ్యాక్సిన్ డోసుల నిల్వను డిజిటల్‌గా ట్రాక్ చేయడంతో పాటు టీకా లభ్యత, సేకరణకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచనుంది.వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు టీకా ఇచ్చే సమయం, కేంద్రాలను తెలుసుకోవడం తదితర సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో గతంలో ఉపయోగించిన ‘ఇవిన్’ వ్యవస్థకు ఇది వేగవంతమైన, మెరుగైన సంస్కరణ అని ఆయన పేర్కొన్నారు.మొత్తం ఇవిన్ ప్లాట్‌ఫాం కొవిన్ నెట్‌వర్క్‌గా అప్‌గ్రేడ్ అయింది. కొవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ నిల్వకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్‌గా ట్రాక్ చేయవచ్చు. వ్యాక్సినేషన్లో భాగంగా ప్రతి వ్యక్తికి టీకా రెండు షాట్లు ఇస్తారు. మొదటి షాట్ పొందిన వారిని రెండు మూడు వారాల తర్వాత ఈ యాప్ ద్వారా గుర్తించవచ్చు’ అని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
Tags:Center App on Vaccine