కేంద్రం ప్రచారం ప్రారంభించేశాందోచ్…

Date:14/04/2018
విజయవాడ ముచ్చట్లు:
కేంద్రం తన మార్క్ ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టింది. ఏపీలోని  గ్యాస్ డీలర్లతో… ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. గ్యాస్ లేని రోజుల్లో గృహిణులు పడిన కష్టాలను కూడా చూపిస్తున్నారు. మోడీ ఫోటోతో గ్యాస్ ఫ్రీ గా ఇస్తూ ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉండగా ప్రతి గ్యాస్ కంపెనీ నుంచి డెలివరీ బాయ్స్, సిబ్బంది తమ తమ పరిధుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయించడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. కనెక్షన్ లేనివారిని 20న జరిగే సమావేశాలకు రప్పించి అక్కడికక్కడ ఉచితంగా గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయించాలన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహం.కేంద్రం.. రాష్ట్రం మధ్య ఇక ప్రత్యక్ష పోరు ప్రారంభమైంది. అయితే ఈ వివాదాల మధ్య కేంద్ర సర్వీస్‌లకు చెందిన ఐఏఎస్ అధికారులు సతమతమయ్యే రోజులు ఆరంభమయ్యాయి. ‘ఉజ్వల’ పథకం కింద ఈ నెల 20తేదీన అర్హులైన తెల్లకార్డుదారులందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కోసం ప్రతి గ్యాస్ డీలర్ ఒక్కో మండలంలో.. నగరాలు, పట్టణాల్లో అయితే దళితవాడలు, పేదల కాలనీల్లో ఒక్కోచోట కనీసం 500 మందికి తగ్గకుండా ప్రజలను సమీకరించి గ్యాస్ కనెక్షన్లపై విస్తృత ప్రచారం చేస్తూ మధ్యలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం ఆడియో క్యాసెట్ ప్రదర్శింప చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మూడుకోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్‌ల మంజూరుకై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉజ్వల’ పథకానికి ఆంధ్రప్రదేశ్‌లో మరింత విస్తృత ప్రచారం చేసేందుకు గ్యాస్ కంపెనీలు నడుం కట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 20తేదీ సాయంత్రం ప్రతి గ్యాస్ డీలర్ తన పరిధిలో కనీసం 500 మంది ప్రజలకు తగ్గకుండా భారీ ఎత్తున సభలు నిర్వహించాలని కంపెనీలు నిర్ణయించాయి. గతంలో గ్యాస్ కనెక్షన్ పొందినవారు కూడా ఈ ప్రచార సభలకు విచ్చేసేలా సేఫ్టీ పేరిట గ్యాస్ కనెక్షన్‌దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెబుతామంటూ వారినందరినీ సమీకరించే బాధ్యతను డీలర్లపై మోపారు. ఇందుకోసం డీలర్లు తమ తమ ప్రాంతాల పరిధిలో ప్రచారం చేపట్టారు. ప్రధాని మోదీ ముఖచిత్రంతో కూడిన ఫ్లెక్సీలు ఊరూవాడా వెలుస్తున్నాయి. అత్యధిక జిల్లాల్లో గ్యాస్ డీలర్ల సమావేశాలను నిర్వహించి అందరికీ ప్రత్యేక యాప్‌లు అందచేశారు. 20తేదీ సమావేశం జరిగే రోజున హాజరైన వారందరి చిరునామాలు అందులో తెలియచేయాలంటూ ఆదేశాలు జారీచేసి పైగా తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఈ సభల నిర్వహణకు గాను 10వేలు చొప్పున కేటాయించింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా రాష్ట్రంలో ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రతి జిల్లాలోను కనీసం 40 గ్రామాలను పొగరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించడం కక్ష సాధింపులో భాగమేనని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఎంపిక ఏకపక్షంగా జరిగిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నేడు జరిగిన సమావేశాల్లో ఈ గ్రామాల వివరాలను వెల్లడించారు. 20తేదీ జరిగే సమావేశాల్లో టీవీలు, డీవీడీలు ఏర్పాటుచేసి ఆయిల్ కంపెనీలు అందచేసిన సీడీలను ప్రసారం చేయాల్సి ఉంది. అందులో ప్రధాని మోదీ ప్రసంగం, దేశవ్యాప్తంగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపణీ, దీనివల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఉజ్వల’ పథకం కింద తెల్ల రేషన్‌కార్డు లేకపోయినా అంత్యోదయ వంటి పథకాల లబ్ధిదారులయిన వారికి కూడా నయాపైసా ఖర్చు లేకుండా కేంద్రం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం ప్రారంభించింది. దీపం పథకం కింద లబ్ధిదారు నుంచి డీలర్ వసూలు చేసే సొమ్మును కూడా కేంద్రం డీలర్‌కు మరుసటి రోజే జమ చేస్తూ ఆరుమాసాల తర్వాత ఆ మొత్తాన్ని సబ్సిడీ సొమ్ము నుంచి మినహాయించుకోటం జరిగేది. దాంతో నయాపైసా లేకుండానే కేంద్రం కనెక్షన్ ఇస్తున్నదనే ప్రచారం సాగుతున్నది. దీన్ని ఆసరాగా చేసుకునే కేంద్రం మళ్లీ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో దీపం పథకం కింద ఇప్పటివరకు 12 లక్షల కనెక్షన్లు పంపిణీ జరుగ్గా రూ.230 కోట్లు ఖర్చయింది. ఉజ్వల కింద కేవలం 80వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. మొత్తంపై 98 శాతం పైగా అర్హులకు గ్యాస్ కనెక్షన్లు చేరగా మళ్లీ ఈ ప్రచార దందా ఏమిటని మంత్రులు విస్తుపోతున్నారు. ఇదిలా ఉంటే తండాల్లో రెండు లక్షలకు పైగా కుటుంబాలు పూరిళ్లలో నివసిస్తున్నాయి. అయితే కేంద్రం నిబంధనల ప్రకారం అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పక్కా ఇల్లు అందులో అరుగు ఉంటేనే గ్యాస్ కనెక్షన్ అందుతుంది. ఈ విషయమై కేంద్రం పునరాలోచన చేస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి.
Tags:Center launches campaign

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *