గ్రానైట్‌ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారం

Date:11/01/2019
శ్రీకాకుళం ముచ్చట్లు:
గ్రానైట్‌ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా భారం మోపుతూనే ఉన్నాయి. ప్రధానంగా పర్యావరణ అనుమతులు(ఈసీ) నిబంధనతో గ్రానైట్‌ రంగానికి పెద్ద ఆపద వచ్చి పడింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా గ్రానైట్‌ వర్గాలు నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేకపోయింది. కేంద్రం మెట్టు దిగకపోవడంతో పలు క్వారీలు మూతపడిన పరిస్థితి నెలకొంది. ఐదు హెక్టార్లలోపు క్వారీలకు పర్యావరణ అనుమతుల నుంచి సడలింపు లభించడంతో ఆరు క్వారీలకు ఉపశమనం లభించింది. మరో 25 క్వారీలు ఇబ్బందులతో నిలిచిపోయాయి. టెక్కలి భూగర్భగనులశాఖ సహాయసంచాలకుల కార్యాలయ పరిధిలో 149 లీజులు నడుస్తున్నాయి. ప్రస్తుతం గ్యాంగ్‌ సైజు గ్రానైట్‌బ్లాకు క్యూబిక్‌ మీటరుకు ప్రభుత్వం రూ.2,475 సీనరేజ్‌ చెల్లిస్తున్నారు. మరోవైపు డిస్ట్రిక్ట్‌ మినలర్‌ ఫండ్‌ పేరిట అదనపు వసూళ్లు జరుగుతున్నాయి. అదేవిధంగా జీఎస్టీ భారం కూడా తోడవ్వడంతో గ్రానైట్‌ రంగం ముందుకెళ్లే పరిస్థితి కనిపించడంలేదు.
తిత్లీ తుపాను రెండు నెలలపాటు పెనుప్రభావం చూపింది. 2017, అక్టోబరులో 8,058 క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ బ్లాకులకు అనుమతులు పొందగా, అంతకన్నా పెరగాల్సిన ఆదాయం తగ్గిపోయింది. 2018, అక్టోబరులో 7,815 క్యూబిక్‌ మీటర్లు మాత్రమే ఉత్పత్తి అయింది. అదేవిధంగా 2017, నవంబరులో 9,758 క్యూబిక్‌ మీటర్లు ఉత్పత్తికాగా, 2018, నవంబరులో కేవలం 8,028 క్యూబిక్‌ మీటర్లు ఉత్పత్తి జరిగింది. తిత్లీ ప్రభావం గణనీయంగా గ్రానైట్‌ రంగంపై పడింది. మరోవైపు లింగాలవలస 71 సర్వే నంబరులో నెలకొన్న రహదారి వివాదం మూడు నెలలపాటు ఐదు క్వారీల నిర్వహణకు సమస్యాత్మకంగా మారింది. దీంతో 1,200 క్యూబిక్‌మీటర్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఇలా ఎప్పటికప్పుడు ఊహించని సమస్యలు ఎదురవుతుండడంతో గ్రానైట్‌ రంగం ప్రాభవం తగ్గుతోంది.
ఒకప్పుడు పూర్తిగా చైనా, యూరోప్‌ తదితర దేశాలకు ఎగుమతి చేస్తూ ప్రపంచ వాణిజ్య చిత్ర పటంలో విశేష గుర్తింపును తెచ్చుకున్న శ్రీకాకుళం గ్రానైట్‌ ప్రాభవాన్ని కోల్పోయింది. అయితే స్థానిక మార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి గ్రానైట్‌ పరిశ్రమలు జిల్లాలోనే ఏర్పాటు చేస్తుండడంతో కొంతమేర వ్యాపారం జరుగుతోంది. జిల్లాలో 75 వరకు గ్రానైట్‌ పరిశ్రమలు నెలకొల్పారు. వీటికే 80 శాతం జిల్లాలో ఉత్పత్తి అవుతున్న గ్రానైట్‌ తరలిస్తున్నారు. దీని ద్వారా కొంత వాణిజ్య అవసరాలు తీరుతున్నా ఎగుమతులు తగ్గుతుండడంతో భవిష్యత్తుపై ఆందోళన నెలకొంటోంది.
స్థానిక పరిశ్రమలు కొనుగోళ్లకు, ఎగుమతి చేసే ధరలకు భారీ వ్యత్యాసముండడంతో గ్రానైట్‌ రంగానికి ఎగుమతుల అండ లేకపోతే క్వారీలు ఎక్కువకాలం నిర్వహించే పరిస్థితి ఉండదు. ఎగుమతులు ఊపందుకోవాలంటే ప్రభుత్వం సరళమైన విధానాలు ప్రవేశపెట్టాల్సిన అవసరముందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు స్థానిక పరిశ్రమలకు పెద్దఎత్తున అనుమతుల్లేని రవాణా జరుగుతుందనే అపవాదు ఉంది. దీని నుంచి బయటకు రాకుంటే పరిశ్రమకు కొత్త సమస్యలు వస్తాయని మరికొంత మంది చెబుతున్నారు. ఓవైపు ఉత్పత్తి జరుగుతున్నా మరోవైపు దాని నుంచి ఆదాయం తగ్గు తుండడంతో గ్రానైట్‌ రంగం ఒడిదొడుకులుగా ప్రయాణం సాగిస్తోంది.
Tags:Central and state governments are burdened on granite

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *