– దాతల విజ్ఞప్తి మేరకు శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనేందుకే..
– టీటీడీ ఎలాంటి ఖర్చు చేయలేదు
– తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు
తిరుమల ముచ్చట్లు:
దాతల విజ్ఞప్తి మేరకు వారు ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో ఫిబ్రవరి 25న టీటీడీ ఛైర్మన్, ఈవో ముంబయికి వెళ్లి శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారని, ఇందుకోసం టీటీడీ ఎలాంటి ఖర్చు చేయలేదని టీటీడీ తెలియజేస్తోంది. అదే విధంగా తిరుమలలో పది ఎలక్ట్రిక్ బస్సులను దాత విరాళంగా ఇచ్చారని, ఈ అంశంలో బోర్డు సభ్యులు నాగసత్యంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడమైనది. ఈ విషయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత శ్రీ ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణలు చేసినట్టు ఒక దినపత్రికలో ప్రచురించిన వార్త పూర్తిగా అవాస్తవమని తెలియజేయడమైనది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే విజ్ఞప్తి మేరకు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దాతల విభాగంలో ఫిబ్రవరి 25వ తేదీన టీటీడీ ముంబయిలో శ్రీనివాస కళ్యాణోత్సవం ఏర్పాటు చేసింది. లక్ష మంది భక్తుల సమక్షంలో నిర్వహించే కళ్యాణోత్సవానికి టీటీడీ తరఫున ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డిని, ఈవో ఏవి.ధర్మారెడ్డిని దాతలు ఆహ్వానించారు. మరోవైపు ఫిబ్రవరి 26న ధర్మకర్తల మండలి సమావేశం ఉండడంతో సమయాభావం వల్ల కళ్యాణోత్సవానికి రాలేమని టీటీడీ ఛైర్మన్,
ఈవో దాతలు తెలియజేశారు. టీటీడీ ఛైర్మన్, ఈవో తప్పకుండా రావాలని, ధర్మకర్తల మండలి సమావేశానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని దాతలు కోరారు. సాధారణంగా దాతల కేటగిరీలో శ్రీనివాస కళ్యాణం జరిపేటపుడు వసతి, ప్రయాణ ఖర్చులు కూడా దాతలు ఖర్చు చేస్తారు. ఇందులో భాగంగానే దాత శ్రీకాంత్ షిండే అభ్యర్థన మేరకు వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఛైర్మన్, ఈవో ఫిబ్రవరి 25న మధ్యాహ్నం బయలుదేరి ముంబయిలో కళ్యాణోత్సవానికి హాజరై తిరిగి అదేరోజు రాత్రి 10 గంటలకు తిరుపతికి బయలుదేరి వచ్చారు. ఇందులో టీటీడీకి సంబంధించిన ఏర్పాట్లు ఏమీ లేవు. పూర్తిగా దాతల ఆధ్వర్యంలో ఏర్పాటు అయ్యినదే.
అదేవిధంగా, టీటీడీ 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసిందని, ఆ సంస్థకు నాగసత్యం డైరెక్టర్ అని సదరు వార్తలో ఆరోపించడం సత్యదూరం. వాస్తవానికి మేఘ కృష్ణారెడ్డి తన ఒలెక్ట్రా సంస్థ ద్వారా 10 ఎలక్ట్రిక్ బస్సులను భక్తుల సౌకర్యార్థం టీటీడీకి విరాళంగా అందించారు. అంతేగాని నాగ సత్యంకు ఆ సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. అయితే సదరు వార్తలో బస్సుల సరఫరాలో వాటా కోసమే నాగసత్యంకు ధర్మకర్తల మండలి పదవి కట్టబెట్టారని ఆరోపించడం సత్యదూరం. టీటీడీకి ఉచితంగా వచ్చిన బస్సులపై కూడా అవాస్తవాలను ప్రచారం చేయడం దాతల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుంది.
ఇక టీటీడీ తిరుమల, తిరుపతికి మాత్రమే పరిమితమైన పరిపాలన వ్యవస్థ కాదు. హిందూ ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా జమ్ము నుంచి కన్యాకుమారి వరకు టీటీడీ ఆలయాలను నిర్వహిస్తోంది. ముంబయి వంటి నగరాల్లో నూతన ఆలయాలు నిర్మిస్తోంది. వీటి పర్యవేక్షణ కోసం ఛైర్మన్, ఈవో, ఇతర అధికారులు ఆయా ప్రాంతాలలో పర్యటించాల్సి ఉంటుంది. మరి వారు ఎక్కడకు వెళ్లాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా ఆరోపణలు చేస్తున్న నాయకులే నిర్దేశిస్తారా అన్న అనుమానం కూడా మీ వార్త ప్రచురణ విధానంతో టీటీడీకి కలుగుతుంది.
Tags:Chairman of TTD, Evo, was flown to Mumbai in a special flight at the expense of donors