ఈటెలకు ముందున్న సవాళ్లు

Challenges to the spear

Challenges to the spear

Date:08/10/2018
కరీంనగర్  ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాకముందు… ఉద్యమ సమయంలో ఈటెల రాజేందర్ ముఖ్య నేతగా వ్యవహరించారు 2009లో అసెంబ్లీలో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కూడా వ్యవహరించి పార్టీ వాణిని బలంగా వినింపించారు. ఉద్యమంలోనూ క్రీయాశీలకంగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావంతోనే ఆ పార్టీలో చేరిన ఆయన మూడు పర్యాయాలు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా… 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 15 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
గత ఎన్నికల్లోనూ ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డిపై 57,037 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.వరుసగా మూడుసార్లు విజయం సాధించిన ఈటెల రాజేందర్ కు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్ మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టారు. కానీ, 2014కు ముందు పార్టీలో కీలకంగా ఉన్న ఈటెల ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగానే ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన మరోసారి హుజురాబాద్ నుంచి పోటీచేసి నాలుగోసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన కాంట్రాక్టర్ కేతిరి సుదర్శన్ రెడ్డి 38 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు ముద్దసాని కశ్యప్ రెడ్డి పోటీ చేసి 15 వేల ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కేతిరి సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ కు ఇక్కడ అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేదు.పీసీసీ కార్యదర్శి పాడి కౌశీక్ రెడ్డి గత కొన్నిరోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కువగా ప్రజల్లో ఉండి పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈటెలకు, టీఆర్ఎస్ వైఫల్యాలపై పలు కార్యక్రమాలు చేపట్టారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గరి బంధువు కావడంతో ఆయన ద్వారా టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ కూడా కౌశీక్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో తనకు టిక్కెట్ ఖాయమని కౌశీక్ భరోసాతో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ముద్దసాని కశ్యప్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. ఆయన కూడా టిక్కెట్ ఆశతో ఉన్నారు. వారి కుటుంబానికి ఇక్కడ మంచి పేరు ఉండటం కలిసివస్తుందని భావిస్తున్నారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఇనగాల పెద్దరెడ్డి కూడా మహాకూటమిలో భాగంగా ఈ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు.
ఇక ప్రజల్లో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఈటెలకు నియోజకవర్గ ప్రజల్లో మంచి ఆధరణ ఉంది. ఆయన పోటీ చేసిన ప్రతీ ఎన్నికకు మెజారిటీ పెరుగుతూ పోవడమే ఇందుకు ఉదాహరణ. ఈసారి మంత్రిగా నియోజకవర్గంలో బాగానే అభివృద్ధి పనులు చేయగలిగారు. అయితే, గతంలోలా అందుబాటులో ఉండటం లేదనే అసంతృప్తి కొంత ప్రజల్లో నెలకొంది.
కాంగ్రెస్ నుంచి యువకులైన కౌశీక్ రెడ్డి, కశ్యప్ రెడ్డిలలో ఎవరు బరిలో ఉన్న యువ ఓటర్లు కొంతమేర మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీకి ఈ స్థానం కేటాయిస్తే పెద్దిరెడ్డికి ఉన్న ఓటుబ్యాంకు కూడా కలిపివచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓట్లు టీడీపీ ఎంతమేర పడతాయో చెప్పలేం. రెండుపార్టీలు కలిసి పోటీ చేయడం, వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఈటెలపై సహజంగా ఏర్పడే కొంత వ్యతిరేకత కూటమి అభ్యర్థికి కలిసివచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ద్విముఖ పోరు ఉండనున్న హుజురాబాద్ లో ఇప్పటికైతే ఈటెల బలంగా కనిపిస్తున్నారు.
Tags:Challenges to the spear

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed