చంద్రబాబు ఎక్కే గుమ్మం… దిగే గుమ్మం…

Chandrababu Ekkam Gammam ... Dagam Gammam

Chandrababu Ekkam Gammam ... Dagam Gammam

Date:22/05/2019

విజయవాడ ముచ్చట్లు:

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పోలింగ్ తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్లపై పోరాటం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నిలక ఫలితాల తర్వాత అనసరించాల్సిన వ్యూహంపైనా వరుస భేటీలు జరుపుతున్నారు. ఐతే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో జాతీయ స్ధాయి నేతల చుట్టూ చంద్రబాబు చక్కర్లు కొడుతుంటే…. ఇంట్లోనే ఉన్న జగన్‌కు జాతీయపార్టీల నేతలు ఫోన్లు చేస్తున్నారు. వీటన్నింటికీ కారణం ఈసారి వైసీపీ సాధించబోయే ఎంపీ సీట్లే.ఒక్కోసారి రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఓడలు బండ్లవడం, బండ్లు ఓడలవడం చూస్తూనే ఉంటాం. ఈసారి ఎగ్జిట్ పోల్ ఫలితాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, జగన్ పరిస్ధితి చూస్తుంటే అలానే కనిపిస్తోంది. దీనికి కారణం చంద్రబాబు కూటముల పేరుతో జాతీయ నేతల చుట్టూ చక్కర్లు కొడుతుంటే సరిగ్గా అదే కూటముల నేతలు జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం ఏపీలో జగన్ పార్టీ వైసీపీ సాధించబోయే ఎంపీ సీట్లే అన్నది బహిరంగ రహస్యమే అయినా… గతంలో ఎన్నడూ లేని స్థాయిలో జాతీయ నేతలను తనవైపుకు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అయినట్లు అర్ధమవుతోంది.ఒకప్పుడు కాంగ్రెస్‌తో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్న జగన్ అంటే కాంగ్రెస్ నేతలతో పాటు గతంలో యూపీఏలో భాగస్వామపక్షాలుగా ఉన్న ఎన్సీపీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీల్లో సదభిప్రాయం ఉండేది కాదు. దీనికి జగన్ వైఖరి కొంత కారణం కాగా, ఏపీ రాజకీయాల్లో జగన్ నిర్ణయాత్మకశక్తిగా ఎదగకపోవడం మరొకటి. కానీ రానురానూ పరిస్ధితుల్లో్ మార్పు వస్తోంది. జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ఉనికిలో ఉన్న యూపీఏ, ఎన్డీయే ఇద్దరిలో ఏ ఒక్కరికీ జగన్ బహిరంగంగా మద్దతు ప్రకటించకపోవడం, ఫలితాల ఆధారంగా, రాబోయే ప్రభుత్వాన్ని బట్టి ప్రత్యేక హోదా ఇచ్చే వారికే తన మద్దతు అంటూ జగన్ వదిలిన ఫీలర్ ఇప్పుడు యూపీఏ, ఎన్డీయేలో ఆశలు రేపుతోంది.

 

 

 

 

 

 

 

 

ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో బీజేపీ మరోసారి సొంతంగా మెజారిటీకి అవసరమైన మ్యాజిక్ మార్కు సాధిస్తుందని తేలినప్పటికీ, యూపీఏ పక్షాల్లో ఆశలు సజీవంగా ఉన్నాయంటే అందుకు కారణం వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ పార్టీలే. ఈ ముగ్గురూ కలిసి కనీసం 60 సీట్లు సాధిస్తారన్న అంచనాలు ఉన్నాయి. వీటిని గంపగుత్తగా తమవైపు తిప్పుకోగలిగితే మిగతా లెక్కల్ని సరిచేయడం పెద్ద కష్టమేమీ కాబోదని యూపీఏ భాగస్వామ్యపక్షాలు భావిస్తున్నాయి. దీంతో ఈ ముగ్గురిలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తాడని భావిస్తున్న జగన్ వైపే యూపీఏ గురిపెట్టింది. కాంగ్రెస్ నేతలతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వైసీపీ అధినేత జగన్‌కు వరుస ఫోన్ల వెనుక అసలు ఉద్దేశం ఇదేనని తెలుస్తోంది.హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఇంటికే పరిమితమవుతున్న జగన్‌కు జాతీయ నేతలు ఫోన్లు చేసి మద్దతు కోరుకుంటే, మరోవైపు చంద్రబాబు మాత్రం అదే జాతీయ నేతల ఇళ్లకు వెళ్లి కలుస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చిన్నాచితకా పార్టీల మద్దతు కూడగడతానని వారికి చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంతన్నది ఆయా జాతీయ పార్టీల నేతలకు కూడా తెలుసు. అందుకే ఓ వైపు చంద్రబాబుతో భేటీలు అవుతూనే మరోవైపు జగన్ కోసం వారు ఎదురు చూస్తున్నారు. దీంతో గతంలోలా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు చేజారుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవున్నాయి. ఏదేమైనా నిత్యం కేంద్రం, ఈసీపై పోరాటం పేరుతో విమర్శలకు దిగుతున్న చంద్రబాబుతో పోలిస్తే పూర్తిగా మౌనం వహిస్తున్న జగన్ వైపు జాతీయ నేతలు చూస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో సైతం కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే పరిణామం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 

పుంగనూరు మండలం పంచాయతీల వారిగా ఓటర్లు

 

Tags: Chandrababu Ekkam Gammam … Dagam Gammam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *