మళ్లీ కూటమి జట్టు కడుతున్న చంద్రబాబు

Chandrababu is back in the team

Chandrababu is back in the team

Date:08/11/2018
విజయవాడ ముచ్చట్లు:
జాతీయ స్థాయిలో మోడికి వ్యతిరేకంగా బలమైన కూటమిని నిర్మించేందుకు ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ తరువాత చెన్నైకి వెళ్లి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ కానున్నారు. ఇప్పటికే చంద్రబాబు యత్నాలకు స్టాలిన్‌ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఆయనతో చర్చల అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ రెండు భేటీల కచ్చితమైన తేదీలు వచ్చే వారం ఖరారుకానున్నాయి.
తదుపరి జనవరిలో ఢిల్లీలో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. దీనికి భాజపాను వ్యతిరేకించే పార్టీల అగ్రనేతలంతా హాజరుకానున్నారు. డిసెంబరులోనే ఈ సమావేశం నిర్వహించాలని ముందుగా భావించినా, అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీల అగ్రనేతలు తీరికలేకుండా ఉండటంతో జనవరికి వాయిదాపడింది. ఆ భేటీ నాటికి భాజపాను వ్యతిరేకించే పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తాయని భావిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానంలో తిరిగి వచ్చారు. ఆయనతోపాటు మంత్రులు కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు, లోకేశ్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ ఉన్నారు.విమాన ప్రయాణంలో వీరి మధ్య కొద్దిసేపు రాజకీయ చర్చలు జరిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో తన భేటీ గురించి సీఎం మంత్రులకు వివరించారు.
ఆ సమావేశం తరువాత బీజేపీ ఆత్మరక్షణ ధోరణిలో పడిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏటా విశాఖపట్నంలో జనవరి చివరివారంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సును ఈసారి అదే సమయానికి నిర్వహించాలా, వాయిదా వేయాలా అన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులతో చర్చించారు.
జనవరిలో దావోస్‌లో జరిగే సదస్సుతోపాటు రాజకీయంగా జాతీయ స్థాయిలో ముఖ్యమైన సమావేశాలుంటాయని సీఎం ప్రస్తావించారు. డిసెంబరులోగాని, ఫిబ్రవరిలోగాని నిర్వహిస్తే ఎలాగుంటుందన్న దానిపై కొద్దిసేపు చర్చించారు. ఎన్‌డీఏ నుంచి బయటికి రావటం, బీజేపీపై రాజకీయంగా పోరాడుతున్న నేపథ్యంలో భాగస్వామ్య సదస్సుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉండకపోవచ్చని భావించారు.
Tags: Chandrababu is back in the team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *