శ్రీవారి బ్రేక్ దర్శనంలో మార్పులు..రేపటి నుంచే అమలులోకి..!
తిరుమలలో ఉదయం 8 గంటల నుంచి బ్రేక్ దర్శనాలు..
సామాన్య భక్తులకు తగ్గనున్న నిరీక్షణ సమయం
నెలరోజులు ప్రయోగాత్మక పరిశీలన..
తిరుమల ముచ్చట్లు:

డిసెంబర్ 1వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన సమయం మారనుంది.రాత్రిపూట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లున్న భక్తులను ప్రస్తుతం ఉదయం 6 గంటలకు దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. గురువారం(డిసెంబర్ 1) నుంచి ఉదయం 8 గంటలకు అనుమతించనుంది. ప్రొటోకాల్, శ్రీవాణి ట్రస్టు టికెట్ల భక్తులను ముందుగా అనుమతిస్తారు.స్వామికి రెండోగంట నివేదన తరువాత 10.30 గంటల నుంచి జనరల్ బ్రేక్ దర్శనం టికెట్లున్న భక్తులను, తరువాత టీటీడీ ఉద్యోగుల కుటుంబసభ్యులను దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో సామాన్య భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గనుంది. నెలరోజులు ఈ విధానాన్ని పరిశీలించి ఇలాగే కొనసాగించాలా, లేక పాత పద్ధతినే అమలుచేయాలా అని టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.ఈ మేరకు బుధవారం అన్నమయ్య పాలక మండలిలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి భేటీ అయ్యింది. రేపటి నుంచి వీఐపీ దర్శన సమయంలో మార్పుతో పాటు ఆనంద నిలయం స్వర్ణమయం అంశంపై పాలకమండలి చర్చిస్తోంది. అంతేకాదు.. వసతి సమస్య నివారణ పైనా చర్చించినట్లు తెలుస్తోంది.
Tags: Changes in Srivari break darshan..to be implemented from tomorrow..!
