వచ్చే నెల నుంచి వీఐపీ బ్రేక్ దర్శన వేళల మార్పులు:ఈవో ధర్మారెడ్డి
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 1 నుంచి ఉదయం 8-12 గంటల మధ్య వీఐపీ బ్రేక్ దర్శనాలను కల్పిస్తామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.అందుకు అనుగుణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ టికెట్ల స్లాట్లను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో డయల్ తితిదే ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయం బంగారు తాపడం పనులపై ఆరేడు నెలలుగా ఆగమ సలహా మండలి సభ్యులు పరిశీలన చేస్తున్నారని వెల్లడించారు. బంగారు తాపడం పనులు చేపడితే దాదాపు 6 నెలల పరిధిలో శ్రీవారికి జరిగే ఉత్సవాలు, స్వామివారి దర్శనాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 30న జరిగే తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆనంద నిలయం బంగారు తాపడం పనులకు బంగారాన్ని ఇచ్చేందుకు దాతలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తితిదే ఆపన్న హస్తం పథకానికి రూ.లక్ష డిపాజిట్ ఇచ్చే వారికి ఆరు బ్రేక్ దర్శనాలను కల్పిస్తున్నామని, రూ.10వేలు ఇచ్చేవారికీ కల్పించాలని భక్తులు కోరారని… ఇది కష్టతరమని చెప్పారు. ‘అక్టోబరులో శ్రీవారిని 22.72 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.122.23 కోట్లు లభించాయి. 1.08 కోట్ల లడ్డూలను విక్రయించాం. 10.25 లక్షల మంది తలనీలాలు సమర్పించారు’ అని ఈవో తెలిపారు.

అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు..
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను ఈనెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. తితిదే కార్తిక దీపోత్సవాన్ని నవంబరు 7న కర్నూలు జిల్లా యాగంటిలో, 14న విశాఖపట్నం, 18న తిరుపతిలో నిర్వహిస్తామన్నారు.
Tags: Changes in VIP break visiting hours from next month: Evo Dharma Reddy
