ఒకేసారి 50 వేల మందికి అక్షర పరీక్షలు

Date:15/03/2018
సంగారెడ్డి ముచ్చట్లు:
అక్షరాస్యులుగా 50వేల మంది మహిళలును తయారు చేసేందుకు మెదక్ జిల్లా యంత్రాంగం సిద్ధమౌతోంది. జిల్లాలో 20,334 స్వయం సహాయక సంఘాలుండగా వీటిలో 2లక్షల మంది మహిళా సభ్యులున్నారు. అయితే పలు సందర్భాల్లో గ్రామాల్లోకి వెళ్లినప్పుడు మహిళల్లో నిరక్షరాస్యతను కలెక్టర్ గుర్తించారు. చదువు రాకపోవడం, అక్షరాలు గుర్తించకపోవడంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు గమనించారు. ఈ క్రమంలోనే అమ్మకు అక్షరమాల కార్యక్రమం రూపుదిద్దుకున్నది. గత ఏడాది వేసవి సెలవులకు ముందు ఈ కార్యక్రమానికి కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ స్వయంగా రూపకల్పన చేశారు. వేసవి సెలవుల్లో ఇంటివద్ద ఉండే విద్యార్థినీ, విద్యార్ధులు తమ తల్లులకు చదువు నేర్పించడమే కార్యక్రమం ఉద్దేశం. మహిళా సంఘాల్లో 10 నుంచి 15 సభ్యులుంటారు. అయితే 8 మంది వరకు చదువుకోని మహిళలున్న సంఘాలను అమ్మకు అక్షరమాలకు ఎంపిక చేశారు. ఐకేపీ, సాక్షరభారత్ సంయుక్త రెండు శాఖలకు నిర్వాహణ బాధ్యతలు అప్పగించారు కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్. కార్యక్రమంలో భాగంగా వర్ణమాల అంటే అఆఇఈ…. మొదలుకుని ఱ వరకు అన్ని అక్షరాలతో కూడిన బుక్‌లెట్ అచ్చు వేయించి మహిళా సంఘాలకు పంపించారు. మహిళలు అందులో చూసి రాత నేర్చుకున్నారు. ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా రాయాలో చూపించి, నేర్పించారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 50వేల మందికి చదువు నేర్పించారు. వర్ణమాల, రెండు, మూడు అక్షరాల పదాలు, చిన్న లెక్కలు నేర్పించారు. కార్యక్రమం మొదలు పెట్టి దాదాపు ఏడాది అవుతున్నది. ఈ క్రమంలో మహిళలు చదువు నేర్చుకున్నారా..? అక్షరమాల కార్యక్రమ లక్ష్యం నెరవేరిందా..? బయటకు వెళ్తే మహిళలకు బస్సులు, దుకాణాలు, ఇతర వాటిపై ఉన్న పేర్లను చదువ గలుగుతున్నారా..? అని విచారణ చేపట్టాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు, సిబ్బందికి అప్పగిస్తే బాగుండదని థర్డ్‌పార్టీకి విచారణ బాధ్యత అప్పగించారు. జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) సంస్థకు అప్పగించారు. ప్రస్తుతం ఈ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో అమ్మకు అక్షరమాలపై విచారణ చేస్తున్నారు. అంటే మహిళల వద్దకు వెళ్లి వారి పేర్లు రాయించడం, చదివించడం వంటివి చేయిస్తున్నారు. విచారణ కూడా దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. కాగా అమ్మకు అక్షరమాలతో దాదాపుగా 50వేల మంది చదువు నేర్చుకున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. అమ్మకు అక్షరమాలతో చదువు నేర్చుకున్న జిల్లాలోని 50వేల మంది మహిళలకు ఈ నెల 25న పరీక్ష నిర్వహించనున్నారు. ఓపెన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ సంస్థ ఈ పరీక్షను నిర్వహించనున్నది. ఆ సంస్థనే ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నా పత్రాలను జిల్లాకు పంపించనున్నది. ఆ రోజు జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల్లోని పాఠశాలలో పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చదువడం, రాయడం, లెక్కించడం.. ఉంటాయి. కాగా గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరక్షరాస్యులైన మహిళలకు చదువు నేర్పించనప్పటికీ పరీక్ష రాసే పరిజ్ఞానం లేదని అధికారులు గుర్తించారు. ఇందుకోసం నమూనా ప్రశ్నాపత్రాన్ని జిల్లాలోని అన్ని గ్రామాలకు పంపించారు. ఐకేపీ, సాక్షరభారత్ సిబ్బంది ద్వారా వాటిని మహిళలకు అందేలా చూశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మహిళలు నమూనా ప్రశ్నాపత్రం ఆధారంగా 25న నిర్వహించే పరీక్షకు సన్నద్ధమవుతున్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని నిరాక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం జిల్లాలో చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం అనుకున్న స్థాయిలో విజయవంతమయ్యింది. మొన్నటి వరకు ఇక్కడ పనిచేసిన కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ ప్రయోగాత్మకంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. వేసవి సెలవుల్లో ఇంటివద్ద ఉండే పిల్లలు తమ తల్లులకు చదువు నేర్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. గత ఏడాది మార్చిలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేసిన విషయం కూడా విధితమే. కాగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 475 గ్రామాల్లో ఈ కార్యక్రమం ద్వారా 50వేల మంది మహిళలు చదువు నేర్చుకున్నారు. వీరందరికీ ఈ నెల 25న ఓపెన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు అన్ని పంచాయతీల్లోని పాఠశాలలో పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష పత్రాలు కూడా ఢిల్లీ నుంచే రానున్నాయి. చదవడం, రాయడం, లెక్కించడం పద్ధతిలో పరీక్ష ఉంటుంది. కాగా దాదాపు ఏడాది కాలంగా జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంపై థర్డ్‌పార్టీచే పరిశీలన చేస్తున్నారు. డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో థర్ట్‌పార్టీ పరిశీలన కొనసాగుతున్నది…అమ్మకు అక్షరమాల కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
Tags: Characters for 50,000 people at once

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *