స‌రికొత్త మేకోవ‌ర్‌తో చ‌ర‌ణ్‌ సూరినేని

Charan Surineni with the new McCover
Date:07/02/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
               నటుడు పాదరసంలా ఉండాలని సినిమా పెద్దలు చెబుతుంటారు. పాత్రకు తగ్గట్టు మారుతూ ఉండాలని, పాత్రలో ఒదిగి నటించడానికి అతణ్ణి అతడు మార్చుకుంటూ ఉండాలని అంటుంటారు. తెలుగులో పాదరసం లాంటి యువ నటుల్లో చ‌ర‌ణ్‌ సూరినేని  ఒకరు. ‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించాడు. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’లో మెయిన్ విలన్ గా నటించాడు. ఆ సినిమా చ‌ర‌ణ్‌దీప్‌కి చక్కటి గుర్తింపు తీసుకొచ్చింది. అతడి వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో ప్రతిభ చాటుతున్న చరణ్ సూరినేని తాజాగా సరికొత్త మేకోవ‌ర్‌లోకి వచ్చాడు. జుట్టు బాగా పెంచి, కొంచెం గడ్డంతో స్టైల్‌గా కనిపిస్తున్నాడు.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక ‘సైరా నరసింహారెడ్డి’, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కల్కి’ చిత్రాల్లో చరణ్ దీప్ నటిస్తున్నాడు. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘సీమరాజా’లో చరణ్ సూరినేని కీలక పాత్రలో నటించాడు.  ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు, మేకోవర్ గురించి చరణ్ సూరినేని మాట్లాడుతూ “రాజశేఖర్ గారి ‘పీఎస్వీ గరుడవేగ’లో పాజిటివ్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ రాజశేఖర్ గారితో నటించే అవకాశాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్పించారు. రాజశేఖర్ గారు, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కల్కి’లో నేను పోలీస్ పాత్రలో నటిస్తున్నా. ‘గరుడవేగ’లో నాది పాజిటివ్ క్యారెక్టర్ అయితే… ‘కల్కి’లో నెగిటివ్ క్యారెక్టర్. ఈ సినిమాతో పాటు చిరంజీవిగారితో ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నా.
     అందులో నా పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పలేను. అయితే మంచి పాత్రలో నటిస్తున్నానని చెప్పగలను. అలాగే, తమిళంలోనూ నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికి ఓ పది సినిమాల్లో నటించాను. శివ కార్తికేయన్, సమంత, కీర్తీ సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సీమ రాజా’లో నా పాత్రకూ మంచి స్పందన వచ్చింది. శుక్రవారం ఈ సినిమా తెలుగులో విడుదల అవుతుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నా. కొత్త సినిమాల కోసం సరికొత్త మేకోవ‌ర్‌లోకి వచ్చాను. ప్రస్తుతం మూడు నాలుగు భారీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇంట‌ర్‌నేష‌న‌ల్ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫార్మ్ కోసం రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్‌లో నటించమని సంప్రతించారు. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా. తెలుగులో, తమిళంలో నాకు మంచి మంచి పాత్రలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా దర్శక, నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
Tags:Charan Surineni with the new McCover

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *