జనవరి 27 నుండి 31వ తేదీ వరకు విశాఖలో చతుర్వేద హవనం
– ఏర్పాట్లను పరిశీలించిన జెఈఓ సదా భార్గవి
తిరుపతి ముచ్చట్లు:

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 27 నుండి 31వ తేదీ వరకు విశాఖపట్నంలోని పెందుర్తిలో గల శ్రీశారదా పీఠంలో చతుర్వేద హవనం జరుగనుంది. శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామివారు, ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో లోక కల్యాణం కోసం 5 రోజుల పాటు ఈ చతుర్వేద హవనం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో 32 మంది వేద పండితులు, శాస్త్ర పండితులు పాల్గొంటారు. జనవరి 31న పూర్ణాహుతితో చతుర్వేద హవనం ముగుస్తుంది. ఈ హవనంలో పాల్గొనే భక్తులకు సుఖశాంతులు, ధనధాన్యాలు, దీర్ఘాయుష్షు చేకూరుతాయని పండితులు తెలిపారు.
ఏర్పాట్లను పరిశీలించిన జేఈఓ సదా భార్గవి
టీటీడీ జేఈవో సదా భార్గవి ఆదివారం విశాఖ శారదా పీఠంలో శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామివారిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం చతుర్వేద హవనం ఏర్పాట్లను పరిశీలించారు. యజ్ఞ వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, భక్తుల కోసం చేపడుతున్న ఇతర ఇంజనీరింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.జెఈఓ వెంట ఇఇ సుధాకర్, ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు ఉన్నారు.
Tags: Chaturveda Havanam in Visakhapatnam from 27th to 31st January
