మొక్కల మాటున మోసం 

Cheating on plants

Cheating on plants

Date:17/04/2018
ఖమ్మం ముచ్చట్లు:
నాణ్యమైన మొక్కల పేరిట కొనుగోలుదారులకు నాసిరకమైనవి అంటగడుతూ.. కొందరు నర్సరీల నిర్వాహకులు అక్రమాలకు తెరతీస్తున్నారు. మొక్కల కొనుగోలులో తాము మోసపోతున్నామని అప్పటికప్పుడు తెలుసుకోలేని పరిస్థితి. ఇదే కొందరు వ్యాపారులకు కలిసొస్తుంది.నర్సరీల్లో సొంతంగా అంట్లు కట్టే కేంద్రాలు అతిస్వల్పంగా ఉన్నాయి. ఇక్కడి నర్సరీలు ఇతర ప్రాంతాల నుంచి అంటే కడియం, ఏపీలోని మరికొన్ని ప్రాంతాల నుంచి తెచ్చి మరీ విక్రయిస్తున్నారు. దీంతో వాళ్లు ఇచ్చిందే అసలైన మొక్క అన్నట్లుగా మారింది. మొక్కలు కొనుగోలు చేసిన తరువాత 4-6 సంవత్సరాలకు అసలు నిజం వెలుగుజూస్తుంది. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుంది. రైతుల మొక్కలు పెద్ద తోటగా తయారవుతాయి. బంగినపల్లి మొక్క అని తీసుకెళితే ఆ ఫలం కనిపించదు. దశేరి అంటే మరేదో రకం కనిపిస్తోంది. చిన్నరసాలు అంటే ఇంకేదో రకం దర్శనమిస్తోంది. ఇదీ నర్సరీల్లో నిత్యం జరిగే తంతు. ఈ అక్రమాలను అరికట్టేందుకు నర్సరీ చట్టం ఉన్నా.. అది కాగితాల్లో తప్ప అమలుకు నోచుకోవడంలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వందల సంఖ్యలో నర్సరీలున్నాయి. అయినా ఉభయ జిల్లాల్లో మొత్తం 40 లోపు నర్సరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. నర్సరీ చట్టం అమలు లేక నగుబాటుకు గురవుతోంది. జిల్లాలో అతితక్కువ నర్సరీలకు మాత్రమే సయాన్‌ బ్లాకు ఉన్నాయి.  రెండు జిల్లాల్లో సుమారు 600కు పైగా నర్సరీలున్నాయి. అందులో మామిడి అధికంగా ఉండగా ఇతర పూల మొక్కలు, కొబ్బరి, పండ్ల మొక్కల నర్సరీలున్నాయి. మామిడి అంటు కట్టేందుకు నిపుణులైన గ్రాప్టర్‌ కావాలి. వీరికి కొదవలేదు. అయితే కొంతమంది నర్సరీ యజమానుల అంటు కట్టే విధానాన్ని కాంట్రాక్టుకు ఇస్తున్నారు. మామిడి మొక్కకు అంటు కట్టేందుకు అవసరమైన పుల్లను గ్రాఫ్టరే సేకరించుకొని అంటుకట్టాలి. ఆ అంటు బతికేవరకూ అతనిదే బాధ్యత. ఇలా ఫలప్రదం అయితే ఆయనకు డబ్బులు ఇస్తారు. ఇంతవరకూ బాగానే ఉన్నా కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తి ఎక్కడి నుంచి అంటుకట్టేందుకు అవసరమైన సయాన్‌ పుల్ల సేకరిస్తాడో నర్సరీ యజమానికి తెలియదు. ఏరకం మొక్క నుంచి సయాన్‌ తెచ్చాడో తెలియని స్థితి. దీంతో వారు తెచ్చిందే నాణ్యమైన మొక్క అన్నట్లుగా తయారైంది. కొబ్బరి మొక్కలకు అసలు తెలంగాణాలోనే సంకరీకరణం జరగడంలేదు. ప్రభుత్వ కొబ్బరి నర్సరీల్లో సైతం జరగడం లేదు. అయినా హైబ్రీడు కొబ్బరిమొక్క అంటూ విక్రయాలు సాగిస్తున్నారు. హైబ్రీడైజేషన్‌ చేయాలంటే ఎంపిక చేసిన కొబ్బరిచెట్టుకు కొబ్బరి పిందెలు నేరేడు కాయ సైజు ఉండగా వాటిని ప్రత్యేక సంచుల్లో ఇతర తేనేపురుగులు వ్యాపించకుండా చుట్టి ఎంపిక చేసిన రకాల పుప్పొడిని మూడురోజులపాటు ఆ కాయలకు అద్దుతారు. అలా తయారు అయితేనే హైబ్రీడు మొక్క అంటారు. అదేమీలేకుండా చెట్టు నుంచి నేరుగా కాసిన కాయలను సేకరించి ఇవే హైబ్రీడు కొబ్బరి మొక్కలంటూ విక్రయిస్తున్నారు. నిజం తెలిసేసరికి రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.  అశ్వారావుపేట నుంచి నిత్యం తెలంగాణతోపాటు రాయలసీమ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, అసోం, పశ్చిమబంగా, గుజరాత్‌, బిహార్‌ రాష్ట్రాలకు మొక్కలు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ మామిడి మొక్క కనిష్ఠంగా రూ.35 నుంచి గరిష్ఠంగా రూ.300 వరకూ విక్రయిస్తున్నారు. ఇక్కడ రూ.35కు విక్రయించిన మొక్కలు ఇతర ప్రాంతాల్లో రూ.70కు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయాలు జరపడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు లబోదిబోమంటున్నారు. అశ్వారావుపేట మండలంలో సైతం కొంతమంది రైతులు ఈ విధమైన నష్టాలకు గురయ్యారు.
Tags: Cheating on plants

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *