రేషన్ దందాకు చెక్ 

Date:02/04/2018
ఖమ్మం ముచ్చట్లు;
రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల్లో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఫలితంగా రేషన్ దందాకు చెక్ పడినైట్లెంది. దీంతో ఒక్క మార్చి నెలలోనే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో రూ. 6కోట్ల 41లక్షల 4వేల 46/-లు రాష్ట్ర ప్రభుత్వానికి మిగులు బియ్యం ద్వారా ఆదా అయ్యింది. ఈ పాస్ మిషన్ ద్వారా అర్హులైన లబ్దిదారులకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి, ఫిబ్రవరి నెలలో రేషన్ డీలర్లకు, కార్డుదారులకు ఈ పాస్‌పై సరైన అవగాహన లేకపోవడం వలన ఉమ్మడి ఖమ్మంలో వందలాది మంది కార్డుదారులు బియ్యం తీసుకెళ్లలేదు. ఆ రెండు నెలల్లోనూ బియ్యం నిల్వలు భారీగా ఉన్నాయి. అయితే మార్చి నెలలో మాత్రం పూర్తి స్థాయిలో రేషన్ డీలర్లు బియ్యం సరఫరా చేశారు.ఖమ్మం జిల్లాలో 669 రేషన్ దుకాణాలు ఉండగా ఏఎఫ్‌ఎస్‌సీ కార్డుదారులు (35 కేజీల) వారు 1,52,349 కిలోలు, ఎఫ్‌ఎస్‌సీ కార్డుదారుల వారి బియ్యం 16,63,148 కిలోలు తీసుకెళ్లలేదు. కొత్తగూడెం జిల్లాలో 442 రేషన్ దుకాణాలు ఉండగా అక్కడ ఏఎఫ్‌ఎస్‌సీ కార్డుదారులు (35 కేజీల) వారు 62,215 కిలోలు, ఎఫ్‌ఎస్‌సీ కార్డుదారుల వారి బియ్యం 8,68,381 కిలోలు తీసుకెళ్లలేదు. రెండు జిల్లాల్లో కలిపి 1908.556 టన్నుల బియ్యం ఒక్క మార్చి నెలలో మిగిలాయి. ప్రభుత్వం మిల్లర్ల నుంచి ఒక్క కిలో బియ్యం రూ.22 చొప్పున కొనుగోలు చేసి సబ్సిడీ రూపంలో ప్రజలకు ఒక్క రూపాయకు కేజీ చొప్పున అందిస్తుంది. మిగిలిన బియ్యాన్ని రూ.22 చొప్పున లెక్కిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.6.41 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయింది. దీనిలో ఖమ్మం జిల్లాలో రూ.3.99 కోట్లు, కొత్తగూడెం జిల్లాలో రూ.2.04 కోట్లు ఆదా జరిగింది. దీంతో పాటు పంచదార 7866 కిలోలు మిగిలింది. ఖమ్మం జిల్లాలో 3435 కేజీలు, కొత్తగూడెం జిల్లాలో 4431 కేజీల పంచదార మిగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం1111 రేషన్ దుకాణాలుండగా, 6,71,339రేషన్ కార్డులున్నాయి. ఆహార భద్రత కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ ఆహార భద్రత కార్డు ఉన్న వారికి 35 కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యాన్ని, అన్నపూర్ణ కార్డుదారులకు 10కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం 12,493.81 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెలా సరఫరా చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ ఐటీ ప్రాజెక్టులో భాగంగా కఠినమైన ఈ పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) విధానం 1111రేషన్ దుకాణాల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు. మరో 4గ్రామాల్లో సరైన నెట్‌వర్క్ లేకపోవడం, సిగ్నల్స్ బలహీనంగా ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 12గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. దీంతో ఇలాంటి గ్రామాల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో సరుకులు పంపిణీ జరుగుతున్నా వేలి ముద్రలు సేకరించి ఆ సమాచారాన్ని ఏ రోజుకారోజు సిగ్నల్ సామర్థ్యం బాగా ఉన్న చోటు నుంచి ఈ-పాస్ పోర్టల్‌కు పంపిస్తున్నారు. ఈపాస్ విధానం అమలుతో ప్రజాపంపిణీ వ్యవస్థలో లబ్ధిదారులకు చేరవలసిన రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట పడింది. రేషన్ డీలర్లు, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రేషన్ బియ్యం పక్కదోవ పట్టించేవారు. బియ్యం కార్డుదారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డులు సృష్టించేవారు. ఇంకొందరు తూకంలో మోసం చేసి బియ్యం మిగుల్చుకొని మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. ప్రతి రేషన్ షాపులో బోగస్ కార్డులు, కొందరు బీనామీ డీలర్లు ఉండేవారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందజేయడంలో, మిగులు సరుకులను తూకంలో తరుగుదల లేకుండా ప్రభుత్వానికి తిరిగి అప్పగించడంలో ఇది ఎంతో సహాయపడింది. ఈపాస్ యంత్రాల్లో డిస్‌ప్లే, స్కానర్, కీ ప్యాడ్‌లను తూనికల యంత్రాలకు అనుసంధానం చేసారు. లబ్ధిదారులు, రేషన్ డీలర్ల వేలి ముద్రలను సేకరించి నిక్షిప్తం చేసారు. ఆధార్‌కార్డుతో అనుసంధానంచేయడంతో లబ్ధిదారునికి ఎంత పరిమాణంలో సరుకులు పంపిణీ చేస్తున్న వివరాలు ప్రింట్‌తో పాటు సరుకులు అందిస్తున్నారు. ఈప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతోంది. కార్డుదారుల కుటుంబానికి చెందిన ఎవరో ఒకరు తప్పకుండా రేషన్ షాపునకు వెళ్లి వేలిముద్ర వేస్తేనే సరుకులు ఇస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో ఎప్పడికప్పుడు వివరాలు నమోదవుతున్నాయి. ఒకవేళ సరుకులు మిగిలిపోతే వెంటనే తెలిసిపోతుంది. డీలర్ల అక్రమాలను అరికట్టడంతో పాటు బోగస్ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు.కొంతమంది వేలిముద్రలు సరిగా పడకపోవడంతో బయోమెట్రిక్ విధానంలో ఉన్న సమస్యలను అధిగమించడానికి కొత్తగా ఐరిస్ స్కానరు, గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని వాయిస్ ప్లేయర్ విధానం తీసుకొచ్చారు. గ్రామాల్లో బడాబాబులు, ఆర్థికంగా బలంగా ఉన్నవారికి కొందరికి రేషన్ కార్డులుండగా ఇకపై తప్పనిసరిగా రేషన్ దుకాణానికి వెళ్లాల్సి ఉంది. గ్రామాల్లో ఇంతకాలం గోప్యంగా ఉన్న బోగస్ కార్డులు, అనర్హుల కార్డులు తాజాగా అందరికీ తెలిసి పోతోంది. ఈ కారణంగా 5-10శాతం మంది రేషన్ సరుకులు తీసుకోవడం లేదు. బోగస్, బినామీ కార్డులకు బియ్యం పంపిణీ నిలిచిపోయింది. దీంతో అనూహ్య రీతిలో బియ్యం ఆదా అవుతోంది. ఈ నెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1908.556 టన్నుల బియ్యం ఆదా అయ్యింది. ఖమ్మం జిల్లాలో 1815.497 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 930.596 టన్నుల బియ్యం ఆదా అయినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈపాస్ విధానంతో ప్రతిరోజు బియ్యం ఎంత మందికి పంపిణీ చేసారు? ఏయే లబ్ధిదారులకు తమకు కేటాయించిన కోటా బియ్యం పొందారు? ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాలి? మిగిలిన కోటా ఎంత? తదితర లెక్కలు పూర్తిగా ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఉన్నతాధికారులకు తెలిసిపోతున్నాయి. రేషన్ దాకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో సరుకుల తరుగుదల, తూకంలో తేడాలు లేకుండా పక్కాగా జరుగుతోంది. రేషన్ దుకాణాల్లో డిజిటల్ కాంటాలు ఏర్పాటు చేసారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లలోనూ ఎలక్ట్రానిక్ కాంటాలు ఏర్పాటు చేయగా పక్కాగా తూకం చేసేలా చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 9 చోట్ల ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉండగా వీటన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి జిల్లాస్థాయిలోనూ ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లను కలెక్టరేట్ నుంచి మానిటరింగ్ చేయవచ్చు. ఇప్పటికే సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వెళ్లే స్టేజీ-1 వాహనాలకు, ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లే స్టేజీ-2 వాహనాలకు జీపీఎస్ యంత్రాలు పెట్టి రాష్ట్ర, జిల్లాస్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. వాహనాలు పక్కదోవ పట్టకుండా సరైన ప్రదేశాలకు నేరుగా వెళ్తున్నాయి. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో అక్రమాల నియంత్రణలో భాగంగా ఆకస్మిక తనిఖీల కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటుచేసారు.
Tags:Check for ration rolls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *