మొక్కుబడిగా కొల్లేరు అభయారణ్యాన్ని చెక్‌పోస్టులు

Date:13/07/2020

ఏలూరు ముచ్చట్లు:

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు 11వ శతాబ్ద ప్రాంతంలో ఒక పట్టణం. 17వ శతాబ్దం వరకూ ఇక్కడ మనుషులు సంచరించారు. అయితే తెలుగు రాజుల కాలంలో కొల్లేరు పట్టణం దగ్ధమైపోయినట్లు చరిత్ర చెబుతోంది. తదనతంరం పెద్దగొయ్యిగా ఏర్పడి, గోదావరి, కృష్ణా నదుల నుంచి  వచ్చే అదనపు నీరు, వరదల నీటితో ఈ ప్రాంతం ముంపునకు గురైంది.సముద్రమట్టానికి 10 అడుగుల ఎత్తు వరకూ సుమారు 314 చ.మైళ్ల విస్తీర్ణంలో నీరు నిలబడి ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఒక సరస్సుగా గుర్తించి, కొల్లేరు సరస్సుగా నామకరణం చేశారు. ఇలా 18వ శతాబ్దం ప్రారంభంలో కొల్లేరు సరస్సుగా ఏర్పడింది. సరస్సులో వివిధ రకాల చేపలు, కలువ కాయలు(కలేబికాయలు), నాచు కాయలు ఇలా ఎన్నో రకాల మొక్కలు నీటిలోంచి పుట్టుకువచ్చి కాయలు కాస్తుండేవి.

 

 

 

 

ఆ కాయల్ని తినేందుకు విదేశాల నుంచి 200 రకాలకు పైగా పక్షులు వలస వచ్చేవి. వీటితో పాటు స్థానిక పక్షులు లక్షలాదిగా కొల్లేరులో జీవించేవి. అయితే రానురాను పక్షులు ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితులు కానరావడం లేదు. కొల్లేరు అభయారణ్య పరిరక్షణకు గత ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఆచరణకు నోచుకోలేదు. కొల్లేరుతో పాటు ఐదో కాంటూర్‌ను పరిరక్షించడానికి నిత్యం పహరా కాయాల్సిన యంత్రాంగమే చోధ్యం చూస్తోంది. ఫలితంగా ఒకనాడు కొల్లేరులో తిరుగుతున్న తిమింగాల్ని సైతం లెక్కచేయకుండా బాంబులతో పేల్చేసిన చెరువుల స్థానంలో నేడు పుట్టగొడుగుల్లా కొత్త చెరువులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అడపాదడపా దాడుల పేరుతో ఎంపిక చేసుకున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి, కాసులు దండుకోవడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.ఆటపాకలోని రక్షిత పక్షుల కేంద్రంలో కూడా పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వందలాది విదేశీ పక్షులు మృత్యువాత పడుతున్నాయి.

 

 

 

సాక్షాత్తూ అటవీశాఖ అధికారుల కళ్లముందే ఈ దారుణం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పక్షుల కేంద్రంలో యంత్రాలతో అభివృద్ది పనులు చేయకూడదనే నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. పక్షులు సంచరించే ప్రాంతాల్లో విచ్చల విడిగా చేపలు, రొయ్యల చెరువులు పుట్టుకొస్తుండటంతో మేత, యాంటి బయోటిక్స్‌ విని యోగం విచ్చలవిడిగా జరుగుతూ పక్షుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. ఏటా వేసవిలో కొల్లేరులోని వందలాది ఎకరాల్లో కిక్కిస దగ్ధమవుతోంది. కిక్కిస మంటల్లో వేలాది పక్షులు, పక్షి గుడ్లు మాడి మసైపోతున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కొల్లేరు కుచించుకుపోతోంది. సరస్సు మనుగడకు ప్రమాదం ఏర్పడింది. అంతరించే స్థాయికి పక్షులు చేరుకున్నాయి. కొల్లేరు కిలకిల రావాలు వినాలంటే, సరస్సు మనుగడ కాపాడాలంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొల్లేరు సరస్సుపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.కొల్లేరు సరస్సులో జలాలు కనుమరుగవుతున్నాయి. కొల్లేరు ప్రాంతం నెరలు తీసి బీడు బారుతోంది. వివిధ రకాల ఫ్యాక్టరీలకు చెందిన రసాయన వ్యర్థాలతో కూడిన నీరు కొల్లేరులో చేరుతోంది. దీంతో పక్షులు చనిపోతున్నాయి.

 

 

 

 

వాటి కళేబరాలు పచ్చిక పొదల్లో పడి కుళ్లి కృశించిపోతున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వాటిలో ప్రసిద్ధిగాంచిన విదేశీ పెలికాన్‌ పక్షులూ ఉన్నాయి.  కొల్లేరు అభయారణ్యాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు మొక్కుబడిగా ఉన్నాయి. అభయారణ్య పరిధిలో కృష్ణా జిల్లాలో రెండు, పశ్చిమగోదావరి జిల్లాలో 4 చెక్‌ పోస్టులున్నాయి. చేపల మేత, మందులు, వాహనాల రాకపోకల నిషేధంతో పాటు, కొల్లేరు పక్షుల్ని రక్షించాల్సిన బాధ్యత చెక్‌పోస్టు అధికారులు, సిబ్బందిపై ఉంది. వీరు సరిగా పట్టించుకోనందున అభయారణ్యంలోకి వెళ్లకూడనివన్నీ వెళ్లిపోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రుల వారసత్వానికి దూరంగా అఖిల

Tags: All away from parental inheritance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *