ముందు ఛత్తీస్ ఘడ్…చివరన తెలంగాణ

Date:06/10/2018
విజయవాడ ముచ్చట్లు:
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహిస్తామని మాత్రం సీఈసీ తెలిపారు. రాజస్థాన్‌తోపాటు తెలంగాణలో ఒకేరోజున ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. నవంబర్ 12-19 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 22 అని ఎన్నికల సంఘం తెలిపింది. అంటే సరిగ్గా రెండు నెలల్లో తెలంగాణ ఓటరు తన తీర్పేంటో స్పష్టం చేయనున్నాడు. ఈ రెండు నెలలు పార్టీలకు ఎంతో కీలకం కానుంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో డిసెంబర్ 15లోగా ఎన్నికల ప్రక్రియ ముగిస్తామని సీఈసీ రావత్ తెలిపారు. ఈ రాష్ట్రాల్లో శనివారం నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు నవంబర్ 28న ఎన్నికలు నిర్వహిస్తారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తారు. తొలి దశలో మావోల ప్రాబల్యం అధికంగా ఉన్న దక్షిణ ఛత్తీస్‌గడ్‌లోని 18 స్థానాలకు నవంబర్ 12న ఎన్నికలు నిర్వహిస్తారు.
ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలను నవంబర్ 20న నిర్వహిస్తారు. డిసెంబర్ 11న అన్ని రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు..తెలంగాణ, మిజోరాం మినహా మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్ సింగ్ ఉండగా.. మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ సీఎంగా వసుంధర రాజే అధికారంలో ఉన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక ఈశాన్య రాష్ట్రం మిజోరాం మాత్రమే. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 39 సీట్లకు గానూ 34 సీట్లు వచ్చాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రస్తుతం షెడ్యూలు ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో ముందుగా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు ప్రారంభమవుతాయి. చివరగా డిసెంబర్ 7న తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
Tags:Chhattisgarh front … Telangana at the end

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *