రైతులను ఆదుకుంటాం : టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్

Chief Minister of TPCC
Date:16/04/2018
మహబూబాబాద్  ముచ్చట్లు:
వచ్చే  ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెరాసా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అక్రమాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..  స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకు జరిగిన 14 ఎన్నికల్లో 13 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఘనత  ఈ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలదేనని కొనియాడారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రు నాయక్, ఎంపీగా బలరాం నాయక్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అనుభవించి, లభ్ది పొంది కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తెరాసా లో చేరిన ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఆయన కూతురు కవితలకు తగిన గుణపాటం చెప్పాలని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరున్న తన భూముల్ని కాపాడుకోవడానికి, అక్రమ ఇసుక దందా, నల్ల బెల్లం వ్యాపారం కాపాడుకోవడానికే రెడ్యా నాయక్ కాంగ్రెస్ నుంచి తెరాసాలో చేరాడని ఉత్తమ్ విమర్శించారు. గిరిజన తండాలను, కోయ గూడేలను పంచాయితీలుగా చేయడం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల దస్త్రం పైనే తొలి సంతకం చేస్తామని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా దానిని అమలు చేయకుండా వారిని మోసం చేసాడని అన్నారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు, దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని తెరాసా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించి రైతులను ఆదుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని ఆరు లక్షల మహిళా సంఘాలకు ఒక్కో సంఘానికి  ఒక లక్ష రూపాయల గ్రాంటును, 10 లక్షల ఋణం అందిస్తామని, అభయ హస్తం ఫెన్షన్ ను వెయ్యి రూపాయలకు పెంచుతామని అన్నారు. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జ్ రామచంద్రు నాయక్ అధ్యక్షత వహించగా, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు వీ హనుమంత రావు, ఎమ్మెల్యేలు దొంతి మాధవ రెడ్డి, రా౦మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుదాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ,  రాష్ట్ర మాజీ మంత్రులు విజయ రామారావు, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, రవీంద్ర నాయక్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
Tags:Chief Minister of TPCC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *