వానలతో ప్రసవ కష్టాలు
అదిలాబాద్, ముచ్చట్లు:
అడవి బిడ్డలకు కష్టాలు వాగు కష్టాలు తప్పడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు తీవ్ర ఇబ్బందిగా మారాయి….అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రులకు వెళ్లాలంటే వృద్ధులు, గర్భిణుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఓ గర్భిణి వాగు దాటుతుండగా పురిటి నొప్పులు రావడంతో వాగు గట్టునే ప్రసవించింది. ఈ దయనీయ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ పంచాయతీ మామిడిగూడ కు చెందిన గర్భిణి ఉయిక గాంధారి వాగు దగ్గర ప్రసవించింది. జూలై 18 ఉదయం ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుండగా గ్రామస్థులు ఆమెను ఇంద్రవెల్లి పీహెచ్‌సీకి తరలించేందుకు సిద్ధమయ్యారు.ఈ క్రమంలో మామిడిగూడ వాగు దాటుతుండగా ఉన్నట్టుండి గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి. దాంతో ఆమె వాగు ఒడ్డునే ప్రసవించింది. సమాచారం అందుకున్న పిట్టబొంగరం పీహెచ్‌సీ హెచ్‌ఈవో అశోక్, వాల్గొండ ఏఎన్‌ఎం జానాబాయి, ఆశా కార్యకర్త మైనాబాయి వాగు దాటి వెళ్లారు. గ్రామస్థుల సహాయంతో తల్లీ, బిడ్డలను క్షేమంగా వాగు దాటించారు. అంతేకాదు బాలింత ఆస్పత్రికి చేరేందుకు ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లు నడిచింది. అక్కడినుంచి అంబులెన్స్‌లో ఇంద్రవెల్లి పీహెచ్‌సీకి తరలించారు.
Tags: Childbirth difficulties with rains

