పిల్లలంటే అలుసా..?

Children

Children

Date:26/11/2018
కర్నూలు ముచ్చట్లు:
జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె గదులు, వసతుల లేమి కనిపిస్తోంది. ఏ కేంద్రంలో చూసినా చిన్నారుల సంఖ్య 20-30 పైగానే  రిజిస్ట్రార్‌లో నమోదు చేస్తున్నా… వాస్తవానికి అక్కడ పది మందికి లోపుగానే ఉన్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు, ఆయాలు లేకపోవడం గమనార్హం. ఇదేమని అడిగితే ఇప్పుడే బయటకు వెళ్లామని.. ఉన్నతాధికారులు ఇతర పనులు అప్పగించారని చెబుతున్నారు. అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ‘న్యూస్‌టుడే’ పరిశీలిస్తే మంచినీరు సైతం లేకపోవడంతో ఇంటి నుంచి సీసాలతో తెచ్చుకుంటున్నారు. అత్యవసర సమయాల్లో ఇంటికి పరుగు తీస్తున్నారు. రేకుల షెడ్లల్లో వెలుతురు కనిపించడం లేదు. చాలాచోట్ల విద్యుత్తు సదుపాయం లేదు. స్వచ్ఛత కానరావడం లేదు. కేంద్రాలు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి.అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తోంది. కేంద్రాలకు హాజరయ్యే లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా అసంపూర్తి భవనాల్లో  కేంద్రాలను నిర్వహిస్తూ చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు హాజరయ్యే చిన్నారులకు కాన్వెంట్‌ స్థాయి బోధన అదించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అందుకు ఆ స్థాయిలో విద్యను అందించేందుకు తెలుగు, ఆంగ్ల అక్షరాలతో కూడిన పుస్తకాలు పంపిణీ చేశారు. అందులో కొన్ని బీరువా నుంచి బయటకు తీయడం లేదు. గతేడాది, ఈ ఏడాది చిన్నారుల కోసం ఆట వస్తువులు పంపిణీ చేయగా వాటిని మూలకు చేర్చారు. ఇక కొలతలు, చిన్నారుల బరువులను నమోదు చేసేందుకు ఉపయోగించే పరికరాలను చీరలు చుట్టి ఉంచారు.జిల్లావ్యాప్తంగా ఇటీవల మూడు కేంద్రాలను ఒకేచోటకు చేర్చి చిన్నారులకు ఆంగ్లం, తెలుగులో పూర్తి పరిజ్ఞానాన్ని పెంపొందింపజేసేలా ప్రీస్కూళ్లను ప్రారంభించారు. ముగ్గురు కార్యకర్తలు, ముగ్గురు ఆయాలను నియమించారు. కానీ అక్కడ ఉన్న పిల్లలు కేవలం 20లోపు మాత్రమే. అద్దె భవనాలు, చాలీచాలని ఇరుకు గదుల్లో అష్టకష్టాల మధ్య అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నారు.
ఇక్కడ చిన్నారులకు ఆట, పాటలు, చదువులు సాగడమే కష్టంగా ఉంటే వాటిల్లోనే పోషకాహారం అందించేందుకు వంటలు, నిత్యావసర వస్తువుల బస్తాలు, అలాగే గర్భిణులకు వైద్యసేవలు, పోషకాహారం అందించే పనులు చేయాల్సి రావడంతో ఆ కష్టాలు అన్నీఇన్నీ కావు. చిన్నారులకు పూర్వప్రాథమిక విద్యను అందించే ఉద్దేశంతో జిల్లాలో భవనాలను నిర్మిస్తున్నారు. ప్రారంభమైన ప్రాంతాల్లో అయితే పనులు నాసిరకంగా చేస్తున్నారు. అద్దె భవనాలు కాదు అవి గదులనే చెప్పాలి. ఈ మాత్రం ఇరుకు గదులకు నెల అద్దె పట్టణాల్లో రూ.3 వేలు.. గ్రామాల్లో రూ.750 వంతున ప్రభుత్వం మంజూరు చేస్తోంది. 2015 ఏపీఐపీ నిధులు రూ.6.50 లక్షల చొప్పున సొంత భవనాలకు మంజూరు చేసింది. అయినా అధికారుల సమన్వయ లోపం కారణంగా కొన్ని… స్థల సమస్య ఇంకొన్ని నిర్మాణాలు నిలిచిపోయాయి. మరికొన్ని నిధులు సరిపడక పనులు సగంలో నిలిచిపోయాయి. అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తి చేసేందుకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు అవసరమని పంచాయతీరాజ్‌ అధికారులు కోరినట్లు సమాచారం.
Tags:Children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *