ఉమ్మడి మ్యానిఫెస్టో పై ఇంకా రాని క్లారిటీ

విశాఖపట్టణం ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్‎లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌నేది
తెలుగుదేశం పార్టీ ఆలోచ‌న‌. దీనికోసం అన్ని ర‌కాలుగా క‌స‌ర‌త్తు
చేస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే జ‌న‌సేన పార్టీతో
పొత్తు కుదిరిన‌ప్పటికీ అభ్యర్ధుల విష‌యంలో మాత్రం ఇంకా ఓ నిర్ణయానికి
రాలేక‌పోతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎన్నిక‌ల కోసం దూకుడు పెంచారు.
ఓ వైపు రా.. క‌ద‌లిరా స‌భ‌ల‌తో జిల్లాల ప‌ర్యట‌న‌ల‌కు వెళ్తూనే మిగిలిన
స‌మ‌యాల్లో అభ్యర్ధుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. జిల్లాల వారీగా
ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక‌కు సంబంధించి స‌ర్వేలు, నివేదిక‌లు, స్థానిక
ప‌రిస్థితుల ఆధారంగా చంద్రబాబు ఓ నిర్ణయానికి వ‌స్తున్నారు. వ‌చ్చే
ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో ఇబ్బంది లేని స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక వేగంగా
చేస్తున్నారు.ఇప్పటికే చాలామంది అభ్యర్ధులను అధికారికంగా
ప్రక‌టించ‌క‌పోయిన‌ప్పటికీ ఆయా అభ్యర్దుల‌కు మాత్రం క్లారిటీ
ఇచ్చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లోకి వెళ్లి ఎన్నిక‌ల ప‌నులు, ప్రచారం
చేసుకుంటూ ప్రజల్లోనే ఉండాల‌ని సూచిస్తున్నారు. మ‌రోవైపు ఒకే స్థానంలో
ఒక‌టి కంటే ఎక్కువ‌మంది పోటీలో ఉంటే అలాంటి వారిని పిలిచి స‌ర్ధిచెప్పే
ప్రయ‌త్నం చేస్తున్నారు. ఇలాంటి స్థానాల్లో ఐవీఆర్ఎస్ స‌ర్వే ద్వారా
ఎవరివైపు ఎక్కువ‌మంది ప్రజ‌లు మొగ్గు చూపుతారో అటువంటి వారిని ఎంపిక
చేస్తున్నారు. ఇక కొన్నిచోట్ల ఇంచార్జిలు ఉన్నప్పటికీ ఆశావ‌హులు కూడా
ఎక్కువ‌గానే ఉన్నారు. పొత్తుల‌తో ఎన్నిక‌ల‌కు వెళ్తున్నామ‌ని..

 

 

 


కొంత‌మందికి సీటు రాలేద‌ని నిరుత్సాహ‌ప‌డ‌వ‌ద్దని వారికి న‌చ్చజెప్పే
ప్రయ‌త్నం చేస్తున్నారు.అధికారంలోకి వ‌స్తే పార్టీకోసం క‌ష్టప‌డిన వారికి
త‌ప్పకుండా న్యాయం చేస్తామ‌ని ముందుగానే చెబుతున్నారు. ఇలా
ఎప్పటిక‌ప్పుడు నియోజ‌కవ‌ర్గాల్లో ఉన్న అంత‌ర్గత విభేదాలను
ప‌రిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే జ‌న‌వ‌రిలోనే మొద‌టి
విడ‌త అభ్యర్ధుల జాబితా ప్రక‌టిస్తార‌ని అనుకున్నప్పటికీ వాయిదాల ప‌ర్వం
కొన‌సాగుతూనే ఉంది. ఈ ప్రక‌ట‌న మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు
క‌నిపిస్తున్నాయి. పొత్తుల‌పై పూర్తి స్పష్టత వ‌స్తే గానీ అభ్యర్ధుల
ప్రక‌ట‌న ఉండే అవ‌కాశం క‌న‌బ‌డ‌టం లేదు.తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల
ప్రక‌ట‌న ఆల‌స్యం అవ‌డానికి కార‌ణం పొత్తుల‌పై స్పష్టత రాక‌పోవ‌డ‌మే
అంటున్నారు ఆ పార్టీ నేత‌లు. ఇప్పటికే తెలుగుదేశం-జ‌న‌సేన మ‌ధ్య సీట్ల
విష‌యంపై క్లారిటీ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. అయితే బీజేపీతో పొత్తు విష‌యం
ఎటూ తేల‌క‌పోవ‌డంతో టీడీపీ-జ‌న‌సేన ఉమ్మడి అభ్యర్ధుల ప్రక‌ట‌న కూడా
ఆల‌స్యం అవుతుంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ స‌మావేశాల త‌ర్వాత
పొత్తులపై పూర్తి స్పష్టత వ‌స్తుంద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు
చెబుతున్నారు. ఈనెల 20 వ తేదీ త‌ర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్తార‌ని కూడా
పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి
అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఢిల్లీ
వెళ్తారని ప్రచారం జ‌రిగింది. కానీ ఇంత‌వ‌ర‌కూ ప‌వ‌న్ ఢిల్లీ
వెళ్లలేదు.అస‌లు చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఏం జ‌రిగింద‌నే దానిపై కూడా
ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. వ‌చ్చే వారంలో చంద్రబాబు, ప‌వ‌న్ కూడా ఢిల్లీ
వెళ్తార‌ని.

 

 

 

 అప్పుడే టీడీపీ ఎన్డీయేలో చేరిక‌పై స్పష్టత
వ‌స్తుందంటున్నారు. అయితే బీజేపీతో క‌లిసి వెళ్లడం ఖ‌రార‌యిపోయింద‌ని..
ఇక మిగిలింద‌ల్లా సీట్ల స‌ర్ధుబాటు మాత్రమేన‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతుంది.
ఒక‌వేళ టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ క‌లిసి పోటీ చేస్తే ఎవ‌రు ఎన్ని సీట్లలో
బ‌రిలో ఉంటారనేది స్పష్టత వ‌స్తుంది. దానిక‌నుగుణంగా ఉమ్మడి అభ్యర్దుల
జాబితా ప్రక‌టించ‌వ‌చ్చని తెలుగుదేశం పార్టీ నేత‌ల నుంచి అందుతున్న
స‌మాచారం. పొత్తులతో ఈసారి టీడీపీకి సీట్ల స‌ర్ధుబాటు పెద్ద స‌మ‌స్యగానే
మారింది. దీంతో అభ్యర్ధుల విష‌యంలో చంద్రబాబు ఆచితూచి
అడుగులేస్తున్నారు.మ‌రోవైపు ఉమ్మడి మేనిఫెస్టో విడుద‌ల కూడా ఆల‌స్యం
అవుతుంది. ఉమ్మడి అభ్యర్ధుల ప్రక‌ట‌న‌తో పాటు ఉమ్మడి మేనిఫెస్టో విడుద‌ల
కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇప్పటివ‌ర‌కూ టీడీపీ-జ‌న‌సేన క‌లిసి
మేనిఫెస్టోను రూపొందించాయి. బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీ నుంచి
కూడా మేనిఫెస్టో పై చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంటుంది. అందుకే అభ్యర్ధుల
ప్రక‌ట‌న‌తో పాటు మేనిఫెస్టో విడుద‌ల కూడా ఆల‌స్యం అవుతుంది. ఈ వ‌చ్చే
వారంలో అన్ని అంశాల‌పై పూర్తి క్లారిటీ వ‌స్తుంద‌ని తెలుగుదేశం పార్టీ
నేత‌లు చెబుతున్నారు. ఈ నెలాఖ‌రులోగా అభ్యర్ధుల జాబితాతో పాటు ఉమ్మడి
మేనిఫెస్టో కూడా విడుద‌ల‌య్యే అవకాశం ఉందంటున్నారు.

 

Tags;Clarity on the joint manifesto is yet to come

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *