సిట్ నివేదిక లో గంటాకు క్లీన్ చిట్ 

Date:09/11/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా సిట్ నివేదిక ఉందని విశాఖకు చెందిన విపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. రెండేళ్ళ క్రితం విశాఖలో జరిగిన భారీ భూ కుంభకోణం రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపింది. ఈ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలకమైన నాయకులు ఉన్నారని ప్రతిపక్షాలు ఒక్కటై గొంతెత్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా వేలాది ఎకరాలు కబ్జాకు గురి అయ్యాయని కూడా గగ్గోలు పెట్టాయి.
వాటి ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్) ని ఏర్పాట్ చేసి విచారణకు ఆదేశించింది .నాడు విశాఖలో యధేచ్చగా జరిగిన భూ కుంభకోణాలపైన సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బాహాటంగానే విరుచుకుపడ్డారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావుపైన పరోక్షంగా హాట్ కామెంట్స్ కూడా చేశారు. భూ కుంభకోణాల వెనక పెద్దలు ఎంతో మంది ఉన్నారని కూడా అయ్యన్న మీడియా ముందే చెప్పుకొచ్చారు.
ఈ వివాదం తరువాత చంద్రబాబు సిట్ ని నియమించారు. సిట్ ముందుకు అయ్యన్న స్వయంగా హాజరై ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఇతర విపక్షాలు సైతం సిట్ కి అనేక ఫిర్యాదులు చేసి పూర్తి విచారణ కోరాయి.ఇక సిట్ దాదాపు ఏడాది పాటు విశాఖ భూ కుంభకోణంపైన విచారణ జరిపి పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఈ ఏడాది మొదట్లో సమర్పించింది.
ఆ నివేదికను ఇంతకాలం వెల్లడించకుండా కోల్డ్ స్టొరేజ్ లో పెట్టిన ప్రభుత్వం ఎట్టకేలకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదించింది. అందులో చూస్తే రాజకీయ నాయకుల పాత్ర ఏమీ లేదని తేల్చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తో సహా అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశారు. తప్పంతా అధికారులదేనని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇంతటి భారీ కుంభకోణం వెనక రాజకీయ నాయకులు లేకపోవడంపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సిట్ నివేదిక పూర్తిగా ఏకపక్షంగా ఉందని కూడా విమర్శించారు. అసలైన నిజాలు వెలుగు చూడాలంటే నిష్పాక్షికంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇదే విధమైన డిమాండ్ ని వామపక్షాలు, వైసీపీ, లోక్ సత్తా వంటి పార్టీలు చేస్తున్నాయి. మరో వైపు అధికార పక్షం నేతలు మాత్రం చూశారా మా తప్పు లేదంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ ప్రభుత్వం కావాలనే తమ పార్టీ వారిని తప్పించి కోరలు లేని సిట్ నివేదికను జనం ముందు ఉంచిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
Tags: Clean Chit per hour in the Sit Report

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *