నాగం కు లైన్ క్లియర్….

Date:13/03/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి చేరికపై స్పష్టత వచ్చింది. కొది రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేలా మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగిన రాజకీయ సన్నివేశానికి తెరపడే గడియలు దగ్గరపడుతున్నాయి. అయితే తాను వద్దన్నా.. నాగం జనార్దన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు లైన్ క్లియర్ కావడంతో జేజమ్మ షాక్ లో ఉన్నట్లు సమాచారం. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తూ కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్ఠానం నుంచి జిల్లా నేతలకు గట్టి సంకేతాలు అందినట్లు తెలిసింది.ఒక్క నాగం విష‌యంలోనే కాదు. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేత‌ల‌పై కూడా వ‌ల వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం ఇక్క‌డ నాయ‌కుల‌కు సూచించింది. గుజరాత్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ తీసుకున్న కఠిన నిర్ణయాలను పరోక్షంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్న వర్గం కొంత వెనక్కి తగ్గినట్లు సమాచారం. బీజేపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ లో చేరాలనుకున్న నాగం జనార్దన్ రెడ్డికి ఆ పార్టీ ఓకే చెప్పేసింది.ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కొప్పుల రాజు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోకి దింపే అంశంతో పాటూ నాగం చేరిక విషయంలో ఆయన రాష్ట్ర నేతల అభిప్రాయం తెలుసుకునేందుకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా – పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి – వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క – పీసీసీ సీఎల్పీ నేత జానారెడ్డి – మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ ఆలీ తదితరులతో కొప్పుల రాజు భేటీ అయ్యారు. దాదాపుగా సుధీర్ఘ చర్చ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటానికి లైన్ క్లియర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.అలాగే ఏఐసీసీ స్థాయిలో అదే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి నాగం చేరిక కోసం పావులు కదిపారు. అయితే నాగం చేరికను డీకే ఆరుణ – ఎమ్మెల్సీ దామోదరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. నాగం లాంటి సీనియ‌ర్ కాంగ్రెస్‌లో చేరితే త‌మ ఫ్యూచ‌ర్‌కు ఎక్క‌డ ఇబ్బంది వ‌స్తుందో ? అని వీరిద్ద‌రు టెన్ష‌న్‌గా ఉన్నార‌ట‌. నాగం పాల‌మూరు జిల్లాలో కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇస్తే జిల్లాపై ఆయ‌న గ్రిప్ ఎక్కువ అవుతుంది. ఇక నాగ‌ర్‌క‌ర్నూలు సీటును ఆశిస్తోన్న దామోద‌ర్‌రెడ్డికి షాక్ త‌ప్పేలా లేదు. దీంతో నాగం కాంగ్రెస్ ఎంట్రీపై వీరిద్ద‌రు గ‌రంగ‌రంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఏఐసీసీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అయిన కొప్పుల రాజు రంగంలోకి దిగి ఈ ఇద్దరు నేతలతో మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నేతలను చేర్చుకోవాలని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని మరొక సారి గుర్తు చేసినట్టు తెలిసింది. చివరకు పార్టీలోని సీనియర్ నేతలంతా అంగీకరించడంతో నాగం చేరిక కేవలం లాంఛన ప్రాయమేనని తెలిసింది. ఈ నెలలోనే జరిగే ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల తర్వాత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని నాగం భావిస్తున్నారు. అయితే దీనిపై త్వరలో మరింత స్పష్టత రానున్నట్లు సమాచారం.
Tags: Clear the line to nag ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *